మరోసారి అమెరికాలో కాల్పులు

usa-super-bowl-kansas-city-chiefs-parade-shooting-incident

అమెరికాః అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. మిజోరీలోని కేన్సాస్ సిటీలో గురువారం వెలుగు చూసిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 22 మంది గాయాల పాలయ్యారు. సూపర్ బౌల్ అనే ఫుట్‌బాల్ లీగ్‌లో విజేతగా నిలిచిన కేన్సాస్ సిటీ చీఫ్స్ జట్టు నిర్వహించిన పరేడ్‌‌లో ఈ ఘటన జరిగింది. వేల మంది పాల్గొన్న ఈ పరేడ్‌లో కాల్పులతో ఒక్కసారిగా కలకలం రేగింది. కాల్పుల నుంచి తప్పించుకునేందుకు జనాలు తలో దిక్కుకు పరుగులు తీయడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఘటనలో గాయపడ్డ వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే, క్షతగాత్రుల్లో ఏడుగురికి ప్రాణాంతకమైన గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారిలో టీనేజర్లు కూడా ఉన్నారు.

ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ఘటన వెనక కారణాలు ఏంటో తెలియాల్సి ఉందని వెల్లడించారు. మరోవైపు, కాల్పుల ఉదంతంపై కేన్సాస్ సిటీ చీఫ్స్ నిర్వాహకులు విచారం వ్యక్తం చేశారు. పరేడ్ ముగిసే సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం బాధాకరమని, ఇదో అవివేకమైన హింస అని వ్యాఖ్యానించారు. అయితే, తమ టీం ఆటగాళ్లు, కోచ్‌లు ఇతర సిబ్బంది క్షేమంగానే ఉన్నారని తెలిపారు.

ఏటా నిర్వహించే ఫుట్ బాల్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌నే సూపర్‌ బౌల్ అంటారు. అమెరికాలోని నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరుగుతుంది. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో కేన్సాస్ జట్టు శాన్‌ఫ్రాన్సిస్కో‌పై గెలిచి టోర్నీ విజేతగా నిలిచింది.