జపాన్‌లో 155 సార్లు కంపించిన భూమి.. 24కు చేరిన మృతుల సంఖ్య

24 Dead, Several Feared Trapped As 155 Earthquakes Hit Japan In A Day

టోక్యో: వరుస భూకంపాలతో జపాన్‌ వణికిపోతున్నది. సోమవారం నుంచి ఇప్పటివరకు 155 సార్లు భూమి కంపించిందని జపాన్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఇందులో సోమవారం నాటి 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంతోపాటు 6 తీవ్రత నమోదైన భూకంపాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. అయితే 3 అంతకంటే ఎక్కువ తీవ్రతతో నమోదైనవే అత్యధికంగా ఉన్నాయని చెప్పింది. మంగళవారం తెల్లవారుజామున కూడా ఆరుసార్లు శక్తివంతమైన ప్రకంపణలు వచ్చాయని పేర్కొంది.

ఇక భూకంపం ధాటికి వేల ఇళ్లు, భవనాలు నేలకూలాయి. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరోవైపు.. మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ భూకంపం ఘటనలో ఇప్పటి వరకూ 24 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు జపాన్‌ మీడియా వెల్లడించింది అందులో ఇషికావా నగరంలోనే అత్యధిక మంది మరణించినట్లు పేర్కొంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.

మరోవైపు భారీ భూకంపం నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జపాన్‌లో సునామీ రావడంతో అలలు మీటరు ఎత్తు వరకు ఎగసిపడ్డాయని, దీంతో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. వాజిమా పట్టణంలో దాదాపు 30 భవనాలు కుప్పకూలాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో 43 వేలకు పైగా నివాసితులు అంధకారంలోనే ఉండిపోయారని అధికారులు చెప్పారు. ఇషికావా తీరంలో అలలు విరుచుకుపడ్డాయి.