ఆర్టీసీ ఉద్యోగుల జీతం ఎంత పెరగొచ్చంటే?

good-news-for-tsrtc-employees

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సూపర్ వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, ఇతరుల సర్వీసు ఆధారంగా వేతన పెరుగుదలను అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఉద్యోగుల పదేళ్ల సర్వీసును బట్టి రూ.5,851 నుంచి రూ.8,468 పెరిగే అవకాశం ఉంది. 30 ఏళ్ల సర్వీసు ఉన్నవారికి రూ.9,540 నుంచి రూ. 14,314 పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పైఅధికారులకు భారీగా పెరిగే అవకాశముంది.

దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్‌సీ సమస్య కొలిక్కి వచ్చింది. వారికి 21 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. పెంచిన వేతనాలు జూన్‌ 1 నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించారు. సంస్థలో ఒక్కో ఉద్యోగికి రూ.8 వేల నుంచి రూ.11 వేల వరకు వేతనం పెరుగుతుందన్నారు. 53,071 మందికి ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ఫిట్‌మెంట్‌ పెంపుతో ప్రభుత్వంపై ఏడాదికి రూ.418.11 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు.

ఆర్టీసీలో కొత్త నియామకాలు చేపడతామని, ఉద్యోగులకు బోన్‌సతో పాటు ఇతర ఆర్థిక ప్రయోజనాలు అందించే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని పొన్నం తెలిపారు. కొత్త మార్గాలలో సర్వీసులు నడపాలనే డిమాండ్‌ దృష్ట్యా బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు చెప్పారు. ఆర్డినరీ బస్సులకు ఎక్స్‌ప్రెస్‌ బస్సుల రంగులు వేసి నడుపుతున్నట్లు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై కోపం ఉంటే వేరే విధంగా చూసుకోవాలని, అనవసర ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు.