అమెరికాలో తొలి మంకీపాక్స్ కేసు న‌మోదు

మస్సాచుసెట్స్ కు చెందిన వ్యక్తిలో గుర్తింపు


న్యూయార్క్‌: అమెరికాలో మంకీపాక్స్ వైర‌స్ కేసు న‌మోదు అయ్యింది. మస్సాచుసెట్స్ లో తొలి కేసు నమోదైంది. మంకీ వైరస్ సోకిన వ్యక్తి ఇటీవలే కెనడాకు ప్రయాణించినట్టు గుర్తించారు. దీంతో మరిన్ని మంకీ పాక్స్ వైరస్ కేసులు వెలుగు చూసే అవకాశం ఉందని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విభాగం అంచనా వేస్తోంది. మంకీ వైరస్ సోకిన వ్యక్తి ఎవరెవరితో కలిశాడన్న వివరాలను ఆరా తీస్తున్నారు. ఇప్పటికైతే ఈ వైరస్ తో ప్రజారోగ్యానికి ఎలాంటి మప్పు లేదని అధికారులు భావిస్తున్నారు. పోర్చుగల్ లో ఐదు మంకీ పాక్స్ కేసులు నమోదు కాగా, బ్రిటన్ లోనూ రెండు కేసులు వెలుగు చూశాయి. సాధారణంగా ఆఫ్రికాకే పరిమితమైన ఈ వైరస్ యూరోప్, అమెరికాను చేరడం గమనించాలి. స్పెయిన్ హెల్త్ విభాగం సైతం 23 కేసులు వెలుగు చూసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. మంకీపాక్స్‌ను సీరియ‌స్ వైర‌స్ కేసుగా భావిస్తున్నారు. ఫ్లూ లాంటి ల‌క్ష‌ణాల‌తో అస్వ‌స్థ‌త ప్రారంభం అవుతుంది. జ్వ‌రం, వ‌ళ్లు నొప్పులు, శ‌రీరంపై అమ్మ‌వారు మ‌చ్చ‌లు వ్యాపిస్తాయి.

కాగా, కెన‌డాలోని మాంట్రియ‌ల్‌లో ఆరోగ్య‌శాఖ అధికారులు 13 మంకీపాక్స్ కేసుల‌ను విచారిస్తున్నారు. శ‌రీర ద్ర‌వాలు క‌ల‌వ‌డం వ‌ల్ల మంకీపాక్స్ సోకే ప్ర‌మాదం ఉంది. వ్యాధి సోకిన వ్య‌క్తి శ‌రీరాన్ని తాకినా ఇది వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్య‌క్తి దుస్తులు వేసుకున్నాఆ వైర‌స్ ప్ర‌బ‌లే ఛాన్సు ఉంది. ఇటీవ‌ల యురోప్‌లోనూ మంకీపాక్స్ కేసులు ఎక్కువ‌య్యాయి. పోర్చుగ‌ల్‌, స్పెయిన్‌, బ్రిట‌న్‌లో ఈ కేసుల్ని ఎక్కువ‌గా గుర్తించారు. ఈ వ్యాధి ఎక్కువ‌గా సెక్స్ వ‌ర్క‌ర్ల ద్వారా వ్యాపిస్తున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/