ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది సజీవ దహనం

ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లోని ఓ అపార్ట్మెంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది సజీవదహనం కాగా , మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. బహుళ అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగినట్టు ముఖ్య కార్యదర్శి సుఖ్‌దేవ్ సింగ్ తెలిపారు. మృతుల్లో 10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

13 అంతస్తుల అపార్ట్ మెంట్ లో భారీగా మంటలు చెలరేగాయి. మొదట రెండో అంతస్తులో మొదలైన మంటలు ఆ తర్వాత మిగిలిన అంతస్తులకు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ఈ అపార్ట్ మెంట్ లో 400 మందికిపైగా నివాసం ఉంటున్నారు. అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఆ అపార్ట్ మెంట్ కు వచ్చారు. ఇంతలో మంటలు చెలరేగి ఘోరం జరిగిపోయింది. కాగా, అగ్నిప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. ప్రమాదంలో గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా యంత్రాంగం అత్యవసర ప్రాతిపదికన పనిచేస్తోందని, క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తెలిపారు.

ధన్‌బాద్ అగ్నిప్రమాదంలో ప్రజలు మరణించడం బాధాకరమని, ఈ ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోందని, గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోందని అన్నారు. ఈ ఘటనను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్టు సీఎం సోరెన్ పేర్కొన్నారు.