నెల్లూరులో మరో రుయా ఘటన :108 రాకపోవడంతో బాలుడి మృతదేహాన్ని బైక్ ఫై తీసుకెళ్లిన తండ్రి

రీసెంట్ గా తిరుపతి రుయా హాస్పటల్ లో అంబులెన్స్​ ఘటన మరచిపోకముందే..తాజాగా మరోసారి ఇదే తరహా ఘటన నెల్లూరు లో చోటుచేసుకుంది. కాలువలో పడి మృతిచెందిన బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లి… తిరిగి ఇంటికి తీసుకెళ్లడానికి 108 వాహనాన్ని అడిగితే… నిబంధనలు అంగీకరించవంటూ నిరాకరించడం తో బాలుడి తండ్రి మృతదేహాన్ని బైక్ ఫై ఇంటికి తీసుకెళ్లిన ఘటన అందర్నీ కంటతడి పెట్టించింది.

వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లాలో శ్రీరామ్‌ (8), ఈశ్వర్‌ (10) అనే ఇద్దరు అబ్బాయిలు బహిర్భూమికి వెళ్లి.. కనిగిరి జలాశయం ప్రధాన కాలువలో ప్రమాదవశాత్తూ మునిగి మృతి చెందారు. ఈశ్వర్‌ మృతదేహాన్ని కాలువ వద్ద నుంచి ఇంటికి తీసుకెళ్లగా, శ్రీరామ్‌ను నీటిలో నుంచి బయటకు తీయగానే స్థానికులు, బంధువులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్స్ చెప్పడం తో అక్కడి నుండి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలని 108 వాహన సిబ్బందిని కోరగా.. నిబంధనలు అంగీకరించవంటూ వారు నిరాకరించారు. అదే సమయంలో మహాప్రస్థానం వాహనం కూడా అందుబాటులో లేకపోవడం.. ఆటోలు, ఇతర వాహనాల వారిని బతిమాలినా ఎవరూ ముందుకు రాకపోవడం తో..ఇక చేసేది ఏమిలేదని ఆ తండ్రి తన కొడుకు మృతదేహాన్ని తన బైక్ పైనే ఇంటికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.