పల్నాడు జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా ..

పల్నాడు జిల్లాలో ఓ ప్రైవేటు స్కూల్ కు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. నరసరావుపేటలోని ఓ ప్రైవేటు స్కూల్ కు చెందిన బస్సు పమిడిమర్రులో విద్యార్థులను ఎక్కించుకుని స్కూల్ కు బయలుదేరింది. ఈ క్రమంలో మార్గమధ్యమంలో ఓ మలుపు వద్ద రోడ్డుపై నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి డ్రైవర్‌ స్టీరింగ్‌ను ఒక్కసారిగా తిప్పడం తో బస్సు బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో బస్సులోని ఐదుగురు తీవ్రంగా.. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన విద్యార్థులను నరసరావుపేటలోని ఓ ప్రైవేటు హాస్పటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామీణ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు వివరాలు నమోదు చేశారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది విద్యార్థులు ఉన్నారు.