నేటి నుంచి అందుబాటులోకి తిరుమల శ్రీవారి మెట్ల మార్గం

ప్రత్యేక పూజల అనంతరం భక్తులను అనుమతించనున్న టీటీడీ

తిరుపతి : ఈరోజు నుంచి శ్రీవారి భక్తులకు శ్రీవారి మెట్ల నడకమార్గం అందుబాటులోకి వస్తోంది. తిరుమలకు నడిచి వెళ్లేందుకు భక్తులు అలిపిరి మార్గంతో పాటు, శ్రీవారి మెట్టు మార్గాన్ని కూడా ఉపయోగిస్తారు. గత నవంబరులో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గం అక్కడక్కడ ధ్వంసమయింది.

ఈ నేపథ్యంలో గత 5 నెలలుగా ఈ మార్గం మరమ్మతు పనులు జరిగాయి. సుమారు రూ. 3.60 కోట్ల వ్యయంతో పనులు పూర్తి చేశారు. 800, 1200 మెట్ల వద్ద కూలిపోయిన వంతెనలను కూడా పటిష్ఠంగా నిర్మించారు. కాసేపట్లో ఈ మార్గానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను అనుమతిస్తారు. ఈ మార్గం ద్వారా కొండపైకి వెళ్లాలనుకుంటున్న భక్తులు ఇప్పటికే చాలా మంది అక్కడకు చేరుకున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/