వరద బాధితులకు రూ.10వేలు, 20 కిలోల బియ్యం అందజేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటన

,

గోదావరి వరద బాధితులకు రూ.10వేలు, 20 కిలోల బియ్యాన్ని వెంటనే అందజేయాలని కేసీఆర్ ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా చోటుచేసుకున్న విపత్తు, గోదావరి వరద పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు కేసీఆర్‌ భద్రాచలంకు వచ్చారు. ఉదయం హన్మకొండ నుండి రోడ్డు మార్గాన భద్రాచలం కు చేరుకున్నారు. భద్రాచలంకు చేరుకోగానే ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్న గోదావ‌రి న‌దికి శాంతి పూజ నిర్వ‌హించారు. అనంతరం ముంపు ప్రాంతాలపై సమీక్షా నిర్వహించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. భ‌ద్రాచ‌లంలోని వ‌ర‌ద ముంపు బాధిత కుటుంబాల‌కు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. వ‌ర‌ద‌ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డుతామ‌న్నారు. అదే విధంగా ముంపున‌కు గుర‌య్యే ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఎత్తైన ప్ర‌దేశంలో రూ. 1000 కోట్ల‌తో కొత్త కాల‌నీ నిర్మిస్తామ‌ని ప్రకటించారు.

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా పోలీసు, ఎన్డీఆర్ఎఫ్‌, ఆర్మీ ద‌ళాలు త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్నారు. కొత్త‌గూడెం, ఖ‌మ్మం క‌లెక్ట‌ర్లు గొప్ప‌గా ప‌ని చేసి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నందుకు వారిని ప్ర‌త్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. భ‌ద్రాచ‌లం ప‌ట్ట‌ణం వ‌ర‌ద ముంపున‌కు గురికాకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను మ‌రో ప్రాంతానికి త‌ర‌లించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటాం. సింగ‌రేణి, ప్ర‌భుత్వం క‌లిసి రూ. 1000 కోట్ల‌తో రెండు, మూడు వేల ఇండ్ల కాల‌నీ నిర్మించ‌బోతున్నాం. దీనికి సంబంధించి అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటారు. భ‌ద్రాచలం, పిన‌పాక‌లో వ‌ర‌ద బాధ‌లు లేకుండా చ‌ర్య‌లు చేప‌డుతాం. గోదావ‌రికి 90 అడుగుల మేర వ‌ర‌ద వ‌చ్చినా ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కేసీఆర్ ఏటూరునాగారంకు హెలికాఫ్టర్ లో బయలుదేరారు.