సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచిన పీవీ సింధు

పీవీ సింధు ఖాతాలో మరో రికార్డు చేరింది. తొలిసారి సింగపూర్ ఓపెన్ 2022 విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది.ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి వాంగ్ జి యిపై, సింధు విజయం సాధించారు. 21-9, 11-21, 21-15 తేడాతో సింధు, వాంగ్ జిని ఓడించింది. మొదటి గేమ్‌ను సింధు గెలుచుకోగా, రెండో గేమ్‌లో దారుణంగా ఓడిపోయింది. తర్వాత చివరిదైన మూడో గేమ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి, సింగపూర్ ఓపెన్, సూపర్ 500 టైటిల్ గెలుచుకుంది. భారత దేశం నుంచి ఈ టైటిల్ సాధించిన రెండో క్రీడాకారిణిగా సింధు నిలిచింది. ఇంతకుముందు ఈ టైటిల్ సైనా నెహ్వాల్ గెలుచుకుంది.

ఆసియా ఛాంపియన్​షిప్స్​ గోల్డ్​ మెడలిస్ట్​, 22 ఏళ్ల వాంగ్​.. సింధు ముందు తేలిపోయింది. తొలి సెట్​ను అలవోకగా నెగ్గిన భారత షట్లర్​.. రెండో సెట్​ను 11-21తో కోల్పోయింది. మూడో సెట్​ను మళ్లీ 21-15తో గెల్చుకొని.. ట్రోఫీని కైవసం చేసుకుంది.జులై 28 నుంచి బర్మింగ్​హామ్​లో జరగనున్న కామన్​వెల్త్​ గేమ్స్​కు ముందు ఈ విజయం సింధుకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఈ సీజన్​లో సింధుకు మొత్తంగా ఇది మూడో టైటిల్​. ఇప్పటికే 2022లో రెండు సూపర్​ 300 టైటిళ్లు గెల్చుకుంది. ఈ విజయం తనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని, తను మరో మెట్టు ఎక్కేందుకు దోహద పడుతుందని సింధు మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించింది.