రఘురామకు ఏపీ సీఐడీ నోటీసులు..

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో ఇవాళ విచారణకు హాజరవ్వాలని ఏపీ సీఐడీ అధికారులు ఆదేశించారు. గతంలో మాదిరిగానే తనను హైదరాబాద్‌లో విచారించేలా ఆదేశాలివ్వాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఇవాళ ఆయన విచారణకు వస్తారా.? లేదా.? అనేది ఆసక్తికరంగా మారింది.

ఏపీ సీఐడీ అధికారులు 2021 మే 14న రఘురామపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారని 124-ఏ , Ipc 153 – బీసెక్షన్ కింద సీఐడీ కేసునమోదు చేసింది. ఐపీసీ సెక్షన్ 505 కింద బెదిరింపులకు పాల్పడటం, ఐపీసీ సెక్షన్ 120-B కింద దురుద్దేశపూర్వకంగా కుట్రకు పాల్పడ్డారనే అభియోగాల కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసారు. గతేడాది మే 14న ఎంపీ రఘురామను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో నోటీసులిచ్చి అదుపులోకి తీసుకుని.. గుంటూరు తరలించారు. అయితే సీఐడీ విచారణ పేరుతో పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని ఎంపీ ఆరోపించారు. ఆ దెబ్బలకు తన కాళ్లు వాచిపోయాయని ఆరోపించారు. దీనిపై గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని హైకోర్టుకు తేల్చి చెప్పారు. ఆ తర్వాత రఘురామ సుప్రీం కోర్టును ఆశ్రయించడం, బెయిల్ ఫై బయటకు రావడం జరిగింది. ప్రస్తుతం దీనిపై మరోసారి సీఐడీ నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని పేర్కొంది.