తెలంగాణలో బీజేపీ ఓడించడమే సీపీఎం లక్ష్యం – తమ్మినేని

తెలంగాణ లో బిజెపి ని ఓడించడమే మా లక్ష్యం అన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్‌కు మద్దతిచ్చిన సీపీఎం పార్టీ నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టింది. బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని.. అందుకే టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో బుధవారం మునుగోడు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. మత ఘర్షణలు పెట్టి లాభపడేందుకు బీజేపీ కుటిల యత్నం చేస్తుందని మండిపడ్డారు. దేశంలో మైనార్టీలు ఉండొద్దని, బీజేపీ వాళ్లు మత ఘర్షణలతో రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ మత కలహాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. మునుగోడులో అన్ని సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించామని తమ్మినేని వీరభద్రం అన్నారు. టీఆర్ఎస్ తో సభలలో పాల్గొనటం కాకుండా గ్రామస్థాయిలో ఇంటింటికి తిరిగి టీఆర్ఎస్ తో ప్రచారం చేస్తామని తెలిపారు. తెలంగాణా సాయుధ పోరాటం, తెలంగాణ వారోత్సవాలు, వార్షికోత్సవాలు చేసే హక్కు బీజేపీకి లేదన్నారు. ఈ క్రమంలోనే మునుగోడు ఎన్నికల వరకే టీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందన్న తమ్మినేని… జనరల్ ఎన్నికల్లో అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.