మోడీ రాకను బ్లాక్‌ డే గా ప్రకటించిన ఏఐటీయూసీ

ఈ నెల 12 న ప్రధాని మోడీ తెలంగాణ లో పర్యటించబోతున్నారు. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)ను జాతికి అంకితం చేసేందుకు రామగుండానికి రానున్నారు. ఈ క్రమంలో మోడీ రాకను బ్లాక్ డే గా ప్రకటించారు ఏఐటీయూసీ. బుధవారం హిమాయత్‌ నగర్‌లోని ఎస్‌ఎన్‌ రెడ్డి భవన్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్‌ బోస్‌ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బ్లాక్‌ డేను నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

తెలంగాణ అభివృద్ధికి అనేక హామీలిచ్చిన కేంద్రం వాటిని నెరవేర్చడం లేదని ఆరోపించారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకే రాష్ట్రంలో మోదీ పర్యటిస్తున్నారని పేర్కొన్నారు. 2021 నుంచే రామగుండం ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభించిందని, అప్పటి నుంచి సుమారు పది లక్షల టన్నులకు పైగా ఎరువుల ఉత్పత్తి సరఫరా అవుతుందన్నారు. అయితే ప్రజలను మభ్యపెట్టేందుకు పాత ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు రాష్ట్రానికి రావడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఈనెల 12న నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

మరోపక్క విద్యార్థి జేఏసీ సైతం మోడీ రాకను వ్యతిరేకిస్తుంది. ప్రధాని మోడీ వస్తే రామగుండం అగ్నిగుండం అవుతుందని, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ హెచ్చరించింది. తక్షణమే యూనివర్సిటీల కామన్ రిక్రూట్‌మెంట్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేసింది. యూనివర్సిటీల కామన్ రిక్రూట్‌మెంట్ బిల్లును ఆమోదించకపోవడం వల్ల యూనివర్సిటీల్లో పెండింగ్ పోస్టుల నియామకం ఆగిపోయిందని, బిల్లు ఆమోదించాల్సిందిగా వెంటనే గవర్నర్‌ను రీకాల్ చేయాలని విద్యార్థి జేఏసీ సూచించింది. అటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించారు. ప్రధానికి తెలంగాణపై అనుకోని ప్రేమ పుట్టుకొచ్చిందని, దురుద్దేశంతోనే ప్రధాని తెలంగాణ పర్యటనకు వస్తున్నారని ఆరోపించారు.