ఏపీలో వడదెబ్బకు నలుగురు మృతి

గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, వచ్చే మూడు రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. పెరిగిన ఎండల తీవ్రతకు మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

తాజాగా ఏపీలో వడదెబ్బకు నలుగురు మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో నిన్న ఒక్క రోజే వడదెబ్బకు గురై నలుగురు మరణించడం వారి కుటుంబాల్లో విషాదం నింపారు. కే.బిట్రగుంటలో సాబినేని సుబ్బమ్మ(56), సూరిబాబు(57), సుబ్బరామిరెడ్డి(68), పాత సింగరాయకొండలో కొట్టే పేరమ్మ(65) మృతి చెందారు. నిన్న నెల్లూరు జిల్లా కొండాపురంలో 46.4, ప్రకాశం జిల్లా పచ్చవలో 46.2, కృష్ణ జిల్లా కొండూరులో 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండ తీవ్రతకు శరీరంలో నీరు త్వరగా ఆవిరైపోతుంది కాబట్టి నీటిని అధికంగా తీసుకోవాలి. మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్‌ నీళ్లు ఎక్కువగా తాగాలి. వీటి వల్ల శరీరం డీ హైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. ఉదయం 10 గంటలకల్లా బయట పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చేయాలి. బయటకు వెళ్లినప్పుడు మంచి నీళ్ల సీసా తీసుకెళ్లాలి. తలపై టోపీ లేదా స్కార్ఫ్‌ ధరించాలి సూచిస్తున్నారు.