ప్రహసనంగా ఎన్నికల ప్రక్రియ!

voters
voters


భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్న తీరుపట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవ్ఞ తున్నది. ఎన్నికల్లో అంగ,ఆర్థిక, కులబలం తోపాటు అక్రమాలకు అంతేలేకుండాపోతున్నది. పంచాయతీ ఎన్నికల నుండి పార్లమెంటు ఎన్నికల వరకు వారి వారి స్థాయిని బట్టి ఎన్నికల ప్రచారంలో కానీ, పోలింగ్‌లో కానీ అరాచకాలకు పాల్పడుతున్నారు. పోలింగ్‌ బూత్‌లను స్వాధీనం చేసుకోవడం, రిగ్గింగ్‌కు పాల్పడటం, లేక డబ్బు వెదజల్లి, మద్యం పంపిణీ చేసి అయినా ఎన్నికల్లో గెలవాలనే ధ్యేయంగా కొందరు అభ్యర్థులు వ్యవహరిస్తుండటంతో ఎన్నికల ప్రక్రియే ఒక ప్రహసనంగా మారిపోతున్నది. ధనప్రభావంతో రాజకీయాలు కలుషితం కావడంతోపాటు విధ్వంసకరంగా మారాయని ఎన్నికల సంఘం మాజీ ముఖ్య ఎన్నికల కమిషనర్‌ టి.ఎస్‌ కృష్ణమూర్తి శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ధనప్రాబల్యంపై గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైన సదస్సుల్లో ‘భారతీయ రాజకీయాల్లో చట్టబద్ధమైన ప్రచార వ్యయం అనే అంశంపై జరిగిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తూ ఎన్నికలు జరుగుతున్న తీరుపట్ల ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ పార్టీలు అన్నీ రకరకాల ఉచితాలను, పోటాపోటీగా ప్రకటిస్తున్నాయని, దీన్ని కట్టడి చేసేందుకు చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లో జరిగిన మరొక సమావేశంలో అన్నారు. రాజకీయ పార్టీల హామీలపై కూడా గరిష్టపరిమితిని విధించాలని సూచిం చారు. రాజకీయాల్లో ధనప్రాబల్యానికి ముక్కుతాడు వేయాలంటే పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. ఒకేసారి నిర్వహిస్తే ప్రతి ఎన్నికకు ఉచితాలు హామీలు, ప్రకటనలు ఉండవని, ఐదేళ్లపాటు ప్రజాసంక్షేమంపై దృష్టిపెట్టవచ్చునని సూచించారు. 1967 నుంచి ఎన్నికల తీరును పరిశీలించిన తర్వాత తాను ఈ అభిప్రాయానికి వచ్చినట్లు వెల్లడించారు. రాజకీయాల్లో ధన ప్రాబల్యంపై హైదరాబాద్‌లో ఐఎస్‌బిలో ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సుల్లో ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ ఎన్నికల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు సూచ నలు చేశారు. ఇక ఎన్నికల్లో అభ్యర్థులు చేసే వ్యయం రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలపై సంస్థాగత భారం అనే అంశంపై గురువారం మాట్లాడుతూ ఎన్నికల్లో ఒక్కొక్క ఎంపి దాదాపు యాభై కోట్లవరకు ఖర్చు చేస్తున్నట్లు మూడేళ్ల క్రితం జరిగిన సదస్సుల్లో భారత ఎన్నికల మాజీ కమిషనర్‌ బ్రహ్మ వెల్లడించిన విషయాన్ని ఉదహరించారు. కొందరు ఎంపి అభ్యర్థుల ఆస్తులు ఐదేళ్ల కాలంలో ఐదువందల రెట్లు పెరుగుతుండడం దురదృష్టకర పరిణామం అన్నారు. ప్రజాస్వామ్యం మనుగడకు ఎన్నికలు ప్రాణం వంటివి. ఎన్నికలు స్వేచ్ఛగా, పక్షపాతరహితంగా, నిర్వహించుకోలే కపోతే అసలు ప్రజాస్వామ్యానికే అర్థం ఉండదు. ఆ ఎన్నికలకు ఎన్నికల కమిషనే ఊపిరి.అంగబలం,ధనబలం ఉన్నవారితోపాటు నేరచరితులు ప్రవేశిస్తుండటంతో ఎన్నికల ప్రక్రియ అపహాస్యంగా మారడం ఏనాటి నుంచో ఆరంభమైంది. బడితెగలవారిదే బర్రె అన్నట్లు ఎన్ని అడ్డ దారులు తొక్కిఅయినా అధికారం దక్కించుకోవాలని ఆరాటపడే వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతున్నది. అధికారం, పదవ్ఞలు, డబ్బు ఉన్నవారి గుత్తసొత్తుగా మారిపోతున్నాయి.ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. దేశంలో ఏదో ఒకటి, రెండు తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఇదే పంథాలో పయనిస్తున్నాయి. ఒకపక్క కులరహిత సమా జాన్ని నిర్మిద్దామని ఉపన్యాసాలు ఇచ్చే పెద్దలు టిక్కెట్లు ఇచ్చేటప్పుడు మాత్రం ఆయా ప్రాంతాల్లో వారికి ఉన్న కుల బలమెంత? ఏమేరకు సమీకరించగలుగుతారు? వారి ఆర్థిక స్తోమత ఏమిటి? తదితర వివరాలు సేకరించి వాటి ఆధారంగా టిక్కెట్లు కేటాయిస్తున్నారు. గతంలో అప్పటి నేతల్లో ఇవి మనసులో ఉన్నాబయటకు కన్పించే వారు కాదు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవ్ఞ. చివరకు పార్టీ టిక్కెట్లుకూడా డబ్బు పెట్టికొనే దురదృష్టపురోజులు దాపురించాయి. టిక్కెట్టు కేటాయింపులో కానీ, అటు ప్రచారంలో కానీ విజయలక్ష్మి చేరుకోవాలంటే ధనలక్ష్మిదే కీలకపాత్రగా మారిపోయింది. ప్రజాసేవ, నీతినిజాయితీ, సమర్థత, అంకితభావం అనే పదాలు కనుమరుగైపోయా యి. ఇక కప్పదాట్లు, పొత్తుల గూర్చి రాజకీయ పరిశీల కుల ఊహాలకే అందడంలేదు. ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో, ఎలాంటి సమీకరణలు జరుగుతాయో పరిశీలిస్తే విస్తుపోతుంది.ఒకనాడు ఉత్తరభారతానికే పరి మితమైన ఆయారాం, గాయారాం సంస్కృతి ఇప్పుడు దక్షిణభారతదేశానికి కూడా విస్తరించింది. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరితే తమను గెలిపించిన ప్రజలకు ఏ ముఖం పెట్టుకొని జవాబు చెప్పాలనే జంకు, బిడియం ఉండేది. ఇప్పుడు అవేమి లేవ్ఞ.గెలుపేలక్ష్యంగా ఎలాగైనా, ఏమి చేసైనా ఏ పార్టీ నుండి అయినా పోటీ చేసి విజయమే లక్ష్యంగా అడుగులు వేసేందుకుఏమాత్రం వెనుకాడటం లేదు. ఫలితంగా రాజకీయ రూపురేఖలే మారిపోతున్నాయి. ఎన్నికల నిర్వహణలో మార్పులు తేవాలని, కొత్త చట్టానికి రూపకల్పన చేయాలని పెద్దలు సెలవిస్తున్నారు. కానీ ఉన్న చట్టాలతో ఇదే అధికారులతో ఆనాడు శేషన్‌ ఎన్నికల కమిషన్‌ అంటే ఏమిటో ఆచరణ లో చేసి చూపెట్టారు. అప్పటికీ ఇప్పటికీ సాంకేతికంగా ఎంతో అభివృద్ధిచెందాం. అయినా ఎందుకు ఎన్నికల్లో ఈ కట్టడి చేయలేకపోతున్నామో ఒక్కసారి మనస్సుపెట్టి పాలక పెద్దలు ఆలోచించాలి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/