సహాయం ముసుగులో స్వాహా స్వాములు!

In the pursuit of help!

ఆపదలో ఒకరు అల్లాడుతుంటే దాన్ని ఎలా డబ్బు చేసుకుందామనుకునేవారు ఉండటం దురదృష్టకరం. ఇటీవల దేశంలో కొన్ని స్వచ్ఛందసంస్థలు పేదల పేరుతోనో లేక ఇతర కారణాలతో ఇబ్బందులు పడుతున్నవారి పేర్లపైన విరాళా లు సేకరించి సహాయపడతామని చెప్తూ ఆ నిధులను దుర్వినియోగం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించినట్లు సమాచారం. దీనిపై సమగ్ర విచారణ కూడా జరుగుతున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని స్వచ్ఛందసంస్థలకు నోటీసు జారీ చేయడమే కాకుండా కొన్నింటిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు కూడా తెలుస్తున్నది. ఏదిఏమైనా పేదల పేరుతో వారిని ఆదుకుంటామని మాయమాటలుచెప్పి ఇలా నిధులు సేకరించడం ఎంత సంస్కారహీనమో వారికి కూడా తెలియందికాదు.

రెక్కాడితే కానీ డొక్కాడని నిత్యం చేతుల కష్టంపై జీవనం సాగించేవారు ఇలాంటి నీచకృత్యాలకు పాల్పడటం లేదు. అంతో ఇంతో డబ్బుంది. సంఘంలో ఎంతో కొంత గుర్తింపు ఉన్న కొందరు పెద్దల అనుచరులే ఇందుకు పాల్పడు తుండటం అత్యంత బాధాకరం. కష్టపడకుండా డబ్బు సంపాదిం చడం ఎలా అనేది వారి నిత్య అన్వేషణ. డబ్బే ప్రధానం. ఎవరు ఏమనుకున్నా సిగ్గుఎగ్గు వదిలి శవాల మీద డబ్బులు ఏరుకున్నట్లు కొందరు వ్యవహరిస్తున్నారు. అలాంటి వారు దేశవ్యాప్తంగా ఉన్నట్లే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండటం విచారించదగ్గ విషయం. వరదలు వచ్చి నా, తుఫానులు వచ్చినా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, నాగరికతకు ఆమడదూరంలో అడవ్ఞల్లో నివసి స్తున్న గిరిపుత్రుల పేర్లపై కూడా నిధులు సేకరిస్తున్నారు.

అంతేకాదు అత్యంత పవిత్రమైన అయ్యప్పస్వామి పేరుతో కూడా రోడ్లపై భిక్షాటన చేస్తున్నారు. నిజంగా అయ్యప్ప స్వామిని పరమపవిత్రంగా భావించి భిక్షాటన చేసి శబరి మలై వెళ్లి కానుకలు సమర్పించుకుంటే అందులోఎలాంటి తప్పులేదు. ఇంకో వాదనకు కూడా అవకాశం లేదు. కానీ కొందరు అనాధపిల్లలను చేరతీసి వారితో రోడ్లపై భిక్షా టన చేయించే వ్యాపారం పట్లే అభ్యంతరం. సాటి మాన వ్ఞలుగా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే ఆరాటం చాలా మందిలో ఉంటుంది. అందుకు తోచిన సహాయం చేస్తారు. పేరు బయటకు రాకుండా గుప్తదానం కూడా చేస్తారు.

మరికొందరు తమ పేరుతోనో, లేక తాము అభిమానించే, ప్రేమించే పెద్దల జ్ఞాపకార్థంతో కూడా దానధర్మాలు చేస్తుంటారు. తాము కొద్దోగొప్పో ఇవ్వడం కాకుండా రాత్రింబవళ్లు తిరిగి సేకరించి ఆపదలో ఉన్న వారికి అందిస్తుంటారు. మానవ్ఞడిగా పుట్టినందుకు తోటి మానవ్ఞలు ఆపదలో అల్లాడుతున్నప్పుడు తమ శక్తిమేరకు సహాయం అందించడం కనీస ధర్మం, బాధ్యత. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇలాంటివి నిర్వహించడంలో పార్టీలు, సంస్థలు, ఉద్యోగ సంఘాలు సినీప్రముఖులు, ప్రజలు తమవంతు కృషి చేసి సహాయకార్యక్రమాలు గతంలోనే చేశారు.

ఇప్పుడు కూడా చేస్తున్నారు. కానీ ఇదే ముసుగులో కొందరు వ్యక్తులు, మరికొన్ని సంస్థలు స్వలాభాపేక్షతో మంచి,చెడు విచక్షణ మరిచి చందాలు వసూలు చేసుకొని స్వాహా చేయడం జరుగుతూనే ఉంది. గతంలో దివిసీమలో తుఫాను వచ్చినప్పుడుకానీ, మహారాష్ట్రలో లాతూర్‌ భూమి కంపించినప్పుడు కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలు అందించిన విరాళాలు, సేవలు విస్మరించలేం. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున స్పందించి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి.

అప్పుడు కూడా కొందరిపై ఆరోపణలు వచ్చాయి. విరాళాలు ఖాజేస్తే తీవ్రమైన పరిణామాలుంటాయని పాలకులు గట్టి హెచ్చరికలే చేశారు. కానీ మార్పు రాలేదు. అందుకే భిక్షాటన అలవాటైతే మరి ఏ పని చేయడానికి ముందుకురారు. భిక్షాటన అనేది పెట్టుబడి లేని వ్యాపారం. సర్వకాల సర్వావస్థలయందు ఇబ్బంది లేదు. ఇలాంటి వారిలో కొందరు ఆపదలు వచ్చినప్పుడు ప్రత్యక్షమై ప్రత్యక్షంగా వసూలు చేస్తుంటారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు తాము పేదలకు అందిస్తున్న సహాయసహకారాలను వివరిస్తూ మనదేశంలోనే కాదు విదేశాల నుండి పెద్దఎత్తున విరాళాలు సేకరిస్తున్నారు.

కానీ ఇందులో కొందరు సహాయం అందించినట్లు కేవలం రికార్డులు సృష్టించి భోంచేస్తున్నారని విమర్శలు ఏనాటి నుంచో ఉన్నాయి. అందుకే సహాయం చేయాలనుకునే దాతల్లో కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. తాము అందించే విరాళాలు చేరాల్సిన వారికి అందుతున్నాయా ? లేదా అనేది అనుమానంగా మారుతున్నది. ఉభయరాష్ట్రాల్లో వేలాది మంది దాతలున్నారు. వారి మనసులో సహాయసహకారాలు అందివ్వాలని ఉంది.

కానీ తాము అందించే సహకారం అసలైన అన్నార్తులకు అందుతుందా? లేదా అనే సందేహాల్లో కొట్టుకమిట్లాడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు ఈ విరాళాలు వసూలు చేస్తున్నవారిపై పటిష్టమైన నిఘా పెట్టాలి. అటు స్వచ్ఛందసంస్థలు కానీ మరెవరైనా విరాళాలు ఇష్టానుసారంగా వసూలు చేయకుండా ఈ కార్యక్రమాన్ని క్రమబద్ధం చేయాలి.

విరాళాలు స్వాహా చేస్తున్న స్వాములపై కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టపరంగానూ, సాంఘికంగానూ తీవ్రంగా నష్టపోతామన్న భయం వారిలో కల్పిస్తే తప్ప ఇలాంటివి ఆగే అవకాశాలు లేవ్ఞ. పాలకులు ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తాము ఇచ్చే డబ్బు సరిగ్గా వినియోగం కాదేమోనన్న అనుమానాలు పెరగకతప్పవ్ఞ. నిజమైన సేవాసంస్థల వ్యక్తులు వెళ్లి అడిగినా నమ్మకం లేక ఇవ్వని పరిస్థితులు నెలకొంటాయి. ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కారం కాదు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com