కాకినాడలో కార్పొరేటర్‌ దారుణ హత్య

కార్పొరేటర్‌ను కారుతో ఢీ కొట్టి చంపిన వైనం

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కొర్పొరేటర్‌ హత్య కలకలం రేపింది. ఆ ప్రాంత తొమ్మిద‌వ‌ డివిజన్‌ కార్పొరేటర్ కంపర రమేశ్‌ను ఓ వ్య‌క్తి కారుతో ఢీ కొట్టి చంపేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివ‌రాలు తెలిపారు. గ‌త‌ అర్ధరాత్రి ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని, పాతకక్షలే హత్యకు కారణమని అనుమానిస్తున్న‌ట్లు చెప్పారు.

కార్పొరేటర్‌ రమేశ్ తో పాటు ఆయ‌న స్నేహితులు సతీశ్‌, వాసు గ‌త అర్ధ‌రాత్రి ఓ చోట‌ మద్యం తాగారని తెలిపారు. ఆ సమయంలో చిన్నా అనే వ్యక్తికి రమేశ్ ఫోన్ చేసి తాము ఉన్న చోటుకి ర‌మ్మ‌న్నారు. దీంతో చిన్నా తన తమ్ముడితో కలిసి అక్కడికి వచ్చారు. అనంత‌రం తన తమ్ముడి పుట్టిన రోజు ఉంద‌ని కేక్‌ కటింగ్‌కు రావాలని ర‌మేశ్‌ను చిన్నా ఆహ్వానించారు. అయితే, అందుకు రమేశ్ ఒప్పుకోలేదు. అంద‌రూ ఇంటికి వెళ్తున్న స‌మ‌యంలో కారు తాళాల విషయంలో చిన్నా, రమేశ్ గొడ‌వ ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో రమేశ్‌‌ను చిన్నా కారుతో ఢీ కొట్టి హ‌త్య చేశాడు. ఈ హ‌త్య వెనుక పాత కక్ష‌లూ కార‌ణ‌మై ఉంటాయ‌ని పోలీసులు భావిస్తున్నారు.