ఈ ఏడాది భారత్‌కు రానున్న అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ !

జులై తరువాత ఇండియాలో బ్రిక్స్ సమావేశం..ఈ దఫా ముఖాముఖి సాగే అవకాశం

బీజింగ్‌: ఈ సంవత్సరం భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇండియాలో జరిగే బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాల సమావేశం, వర్చ్యువల్ గా కాకుండా, నేరుగా జరిగితే జిన్ పింగ్ వస్తారని తెలుస్తోంది. ఇండియా, చైనా సరిహద్దుల మధ్య గత సంవత్సరం తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడి, సైనికుల మధ్య యుద్ధం జరిగి పదుల సంఖ్యలో ఇరువైపులా జవాన్లు మరణించిన నేపథ్యంలో, ఇప్పుడిప్పుడే బార్డర్ లో శాంతి కుదురుకుంటున్న వేళ, చైనా నుంచి జిన్ పింగ్ సదస్సుకు హాజరు కావడంపై సానుకూల సంకేతాలు వెలువడటం గమనార్హం.

ఈ సంవత్సరం ఇండియాలో బ్రిక్స్ సమావేశాల నిర్వహణకు తమ పూర్తి మద్దతు ఉంటుందని వ్యాఖ్యానించిన చైనా, సరిహద్దు సమస్యకు, ఈ సమావేశానికి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ మాట్లాడుతూ.. ‘మేము ఇండియాతో పాటు ఇతర బ్రిక్స్ సభ్య దేశాలతో కలసి పనిచేస్తాం. అన్ని సభ్య దేశాల మధ్య మరింత బలమైన ద్వైపాక్షిక బంధం, సహాయ సహకారాలపై చర్చిస్తాం. ఆర్థిక, రాజకీయ, భద్రతాపరమైన అంశాలపై కూడా దృష్టిని సారిస్తాం’ అన్నారు.

కాగా, ఈ సంవత్సరం జులై తరువాత జరిగే ఈ సదస్సును తొలుత ఆన్ లైన్ మాధ్యమంలోనే జరపాలని నిర్ణయించినా, బ్రిక్స్ సమావేశాల కన్నా ముందు యూరప్, యూకే తదితర ప్రాంతాల్లో పలు కీలక సదస్సులు జరగనున్నాయి. వీటిని నిర్వహించిన తీరును పరిశీలించి, ఆపై అన్ని దేశాధినేతలనూ ఆహ్వానించి, ముఖాముఖి సమావేశాన్నే నిర్వహించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది.

గత సంవత్సరం మార్చిలో మహమ్మారి అదుపు నిమిత్తం లాక్ డౌన్ పెట్టిన తరువాత, ప్రధాని మోడి తొలిసారిగా తన విదేశీ పర్యటన నిమిత్తం మార్చిలో బంగ్లాదేశ్ కు వెళ్లనున్నారు. ఆపై మేలో యూకేలో జరిగే జె7 సదస్సుకు, పోర్చుగల్ లో జరిగే ఇండియా ఈయూ మీట్ కు హాజరవుతారు. ఆ తరువాత ఇండియాలో బ్రిక్స్ సదస్సు తేదీలు ఖరారవుతాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/