పవన్-బాబు భేటీ ఫై వైస్సార్సీపీ నేతల కామెంట్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్..టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు మరోసారి కలవడంతో వైస్సార్సీపీ నేతలు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఆదివారం హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి బాబు ను పవన్ కలిశారు. ఇప్పటికే రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయని..ఇరువురు కలిస్తే గెలుపు ఖాయమని ప్రచారం జరుగుతుండగా..ఆ ప్రచారాన్ని నిజం చేస్తున్నట్లు చంద్రబాబు-పవన్ తరుచు కలుస్తుండడం వైస్సార్సీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు.

ఈరోజు మరోసారి కలవడం తో వరుసపెట్టి వైస్సార్సీపీ మంత్రులు కామెంట్స్ చేయడం స్టార్ట్ చేసారు. సంక్రాంతి పండుగ మాముళ్ల కోసం దత్తతండ్రి చంద్రబాబు వద్దకు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ వెళ్లాడని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు. ఇక మరో మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘సంక్రాంతికి అందరింటికి గంగిరెద్దులు వెళ్తాయి.. చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లాడు. డూడూ బసవన్నలా తల ఊపడానికి’ అని వ్యంగ్యంగా స్పందించారు.

‘దత్తపుత్రుడు ప్యాకేజీల కోసమే పనిచేస్తాడు. జీవో1ను అడ్డం పెట్టుకుని పరామర్శ పేరుతో భేటీ అయ్యారు. చంద్రబాబు, పవన్ ముసుగు తొలగిపోయింది. పవన్‌కు ప్రత్యేకించి ఒక ఎజెండా లేదు. ప్రభుత్వాన్ని అస్థరపరిచేందుకే చంద్రబాబు, పవన్ కలిశారు. తెలంగాణలో కూర్చోని ఏపీ జీవో గురించి చర్చించడమేంటి? ప్యాకేజీ గురించి మాట్లాడటం కోసమే చంద్రబాబు, పవన్ భేటీ.. ఇది అపవిత్ర కలయిక’ అని మల్లాది విష్ణు విమర్శలు చేశారు.

‘ పవన్.. చంద్రబాబు దత్తపుత్రుడు అని ఎప్పటినుంచో చెబుతున్నాం. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలనేదానిపై చర్చిస్తారు. రాష్ట్రంలో 11 మంది చనిపోతే పవన్ స్పందించలేదు. గతంలో ఓటుకు నోటు కోసం ఇద్దరూ చర్చించారు. ఇప్పుడు కూడా తెలంగాణలో వారిద్దరూ భేటీ అయ్యారు’ అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు.

ఎంపీ మార్గాని భరత్ స్పందిస్తూ.. చంద్రబాబు చెంతకు చేరిన పవన్‌ను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలు అమాయకులు కాదని వ్యాఖ్యానించారు. ఒకరోజు కనబడి నెలరోజులు ఇంట్లో ఉండే వ్యక్తి చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే అంధకారంలో ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో నివాసం.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలా? అని ప్రశ్నించారు. ముసుగు తీసేసి పవన్ ప్రజల్లోకి వెళ్లాలని మార్గాని భరత్ సూచించారు. మొత్తం మీద చంద్రబాబు-పవన్ కళ్యాణ్ లు కలిసి వైస్సార్సీపీ నేతలకు ఓ పని చెప్పారంటూ అంత మాట్లాడుకుంటున్నారు.