ప్రాణం తీసిన వీడియో కాల్.. ఏమైందంటే?

సోషల్ మీడియాతో ఎన్ని లాభాలు ఉన్నాయో, అంతకంటే ఎక్కువ నష్టాలు కూడా ఉన్నాయి. అయితే సోషల్ మీడియాను కొందరు తమ స్వార్ధం కోసం వాడుకుని ఎదుటివారితో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వీడియో చాటింగ్ కారణంగా ఓ వ్యక్తి నిండు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నవీపేట మండలంలోని కోసి గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడికి ఓ గుర్తుతెలియని అమ్మాయి ఫోన్ చేసింది. ఆమెతో మాట్లాడుతున్న శ్రీకాంత్ వీడియో చాట్ చేశాడు. ఈ క్రమంలో ఆ అమ్మాయితో ఆన్‌లైన్‌లో నగ్నంగా వీడియో చాట్ చేశాడు శ్రీకాంత్. కాగా ఈ వీడియో చాట్‌ను ఆన్‌లైన్‌లో పెడతానంటూ శ్రీకాంత్‌ను ఆ అమ్మాయి బెదిరించింది. తనకు అర్జెంటుగా డబ్బులు పంపాలని ఆమె కోరింది. దీంతో ఈ వీడియో చాట్‌ను ఆన్‌లైన్‌లో పెడితే తన పరువు పోతుందని శ్రీకాంత్ భయపడ్డాడు. తన బంధువులు, గ్రామస్థుల ముందు తన పరువు పోతుందనే భయంతో శ్రీకాంత్ వణికిపోయాడు.

దీంతో అతడికి ఏం చేయాలో అర్ధంగాక పొలంలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. శ్రీకాంత్ మృతికి అతడు చేసిన ఆన్‌లైన్ చాటింగ్ కారణమని వారు తేల్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాపు చేపట్టారు. శ్రీకాంత్ మరణంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. సోషల్ మీడియా కారణంగా శ్రీకాంత్‌లా ఎవరూ ఆత్మహత్యకు పాల్పడవద్దని పోలీసులు కోరారు.