వైస్సార్సీపీ ప్లీనరీ మొదటి రోజు షెడ్యూల్‌ ..

వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని నేడు, రేపు వైస్సార్సీపీ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుపుకోబోతుంది. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో ప్లీనరీ జరగబోతుంది.

మొదటి రోజు షెడ్యూల్‌ చూస్తే..

శుక్రవారం ఉదయం పార్టీ జెండాను ఆవిష్కరించి ముఖ్యమంత్రి జగన్‌ ప్లీనరీని ప్రారంభించనున్నారు. తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ముఖ్యమంత్రి, ఇతర నేతలు నివాళులర్పిస్తారు. అనంతరం పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను ప్రకటించనున్నారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి ప్రారంభోపన్యాసం చేస్తారు. తొలి రోజు 5 తీర్మానాలు చేయనున్నారు. రేపు శనివారం ఉదయం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సందేశమిస్తారని షెడ్యూల్‌లో పొందుపరిచారు. సాయంత్రం ముఖ్యమంత్రి జగన్‌ గంటన్నర పైగా ప్రసంగించనున్నారు.

అలాగే మొదటి రోజు లక్ష మంది, రెండోరోజు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగ సమయానికి 3 నుంచి 4 లక్షల మంది హాజరయ్యేలా జన సమీకరణకు పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. పార్టీ నియమావళిలో సవరణనూ ప్లీనరీ వేదికగా చేయనున్నారు. పార్టీ గౌరవాధ్యక్ష పదవిని రద్దు చేయడం, సంస్థాగత నిర్మాణంలో మార్పులు వంటివి ఆ సవరణల్లో ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ప్లీనరీకి జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు, కార్యకర్తలను తరలించేందుకు భారీగా ప్రైవేటు బస్సులను తీసుకున్నారు.

ప్లీనరీ ప్రాంగణం వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రారంభించారు. మంత్రి సీదిరి అప్పలరాజు, తిరుపతి ఎంపీ గురుమూర్తి, స్కిల్ డెవలప్‌మెంట్ సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.