మంత్రి పదవి రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేసిన పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు

ఏపీలో రీసెంట్ గా మంత్రివర్గం ఏర్పటు జరిగిన సంగతి తెలిసిందే. మంత్రి పదవులు దక్కిన వారు తమ బాధ్యతల్లో నిమగ్నమైతే..పదవులు దక్కనివారు మాత్రం ఇంకా ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలువురు పార్టీ అధిష్టానం ఫై సీరియస్ అవ్వడం..రాజీనామాల వరకు వెళ్లడం..వారిని అధిష్టానం బుజ్జగించడం వంటివి జరుగగా..తాజాగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పబ్లిక్ గా తన ఆవేదనను వ్యక్తం చేసారు.

కోటవురట్ల మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సోమవారం జరిగిన వలంటీర్ల సన్మాన కార్యక్రమానికి హాజరైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి నుంచి తనకు ఇప్పటి వరకు కబురు రాలేదన్నారు. తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడేందుకు నియోజకవర్గం నుంచి 60-70 కార్లలో కార్యకర్తలు అమరావతి వెళ్లి సజ్జలను కలిసినట్టు చెప్పారు. వైఎస్సార్ మరణం తర్వాత తాను జగన్ వెంటే ఉన్నానన్నారు. తానేమీ అమాయకుడిని కాదని, నూటికి లక్షశాతం హింసావాదినని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్ఠానం తనను దెబ్బకొట్టిందని, అవకాశం వచ్చినప్పుడు తానూ దెబ్బకొడతానని హెచ్చరించారు. పార్టీ కోసం తాను ఎన్నో త్యాగాలు చేశానని, అయినా తనకు అన్యాయం చేశారని బాబూరావు వాపోయారు.