తెలుగు రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటికబురు అందించారు వాతావరణ శాఖ. గత కొద్దీ రోజులుగా తీవ్ర ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటలు దాటితే కాలు బయటపెట్టాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఓ పక్క తీవ్ర ఎండలు..మరోపక్క కరెంట్ కోతలతో ప్రజలు గగ్గోలుపెడుతున్నారు. ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ చల్లటి వార్త తెలిపింది. రానున్న ఐదు రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో వర్షాలు కురవనున్నట్లు తెలిపారు.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఫలితంగా తెలంగాణలో ఐదు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. విదర్భ నుంచి తెలంగాన మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీన పడిందని వెల్లడించింది. దీని వల్ల తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఇప్పటికే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్న సమయంలో వర్షాలు కురిస్తే వాతావరణం చల్లబడనుంది. తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ లోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ప్రస్తుతం వర్షాలు కురిస్తే ప్రజలకు కాస్త ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు.