విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్

YCP is against privatization of Visakha Steel Plant: CM Jagan

అమరావతిః నేడు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు ఎండాడ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారితో మాట్లాడుతూ..విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తడి చేస్తూనే ఉన్నామని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తమది రాజీ లేని పోరాటమని అన్నారు. ప్లాంట్ కార్మికులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

స్టీల్ ప్లాంట్ కార్మికుల తరపున తొలిసారి గళమెత్తింది వైసీపీ ప్రభుత్వమేనని జగన్ చెప్పారు. తొలిసారిగా ప్రధాని మోడీకి లేఖ రాశామని… స్టీల్ ప్లాంట్ సమస్యకు పరిష్కారాలను కూడా సూచించామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని చెప్పారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని జగన్ తెలిపారు. కేంద్రంలో ఎన్డీయే కూటమికి తగినంత మెజార్టీ రాకపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు మరింత ఒత్తిడి చేస్తామని చెప్పారు. కూటమి పేరుతో బీజేపీ, టీడీపీ, జనసేన కలిశాయని… స్టీల్ ప్లాంట్ కార్మికులు కూటమికి ఓటు వేస్తే వ్యతిరేక సంకేతాలు వెళ్తాయని అన్నారు. కూటమి విధానాలకు వ్యతిరేకమని స్టీల్ ప్లాంట్ కార్మికులు చాటి చెప్పాలని… గాజువాకలో వైసీపీని గెలిపించాలని కోరారు.