శాస్రోక్తంగా ముగిసిన యాదాద్రి మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ‌

సీఎం కేసీఆర్‌కు ఘ‌నంగా స‌త్కారం..

యాదాద్రి భువ‌న‌గిరి : న‌వ్య యాదాద్రిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాతికి పున‌రంకితం చేశారు. జ‌య‌జ‌య ధ్వానాల మ‌ధ్య ప్ర‌ధాన ఆల‌య ప్ర‌వేశం జ‌రిగింది. మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ క్ర‌తువు శాస్రోక్తంగా ముగిసింది. ఆరేళ్ల తర్వాత యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనమిచ్చారు. గర్భాలయంలోని మూలవిరాట్ నిజరూపంలో దర్శనమిచ్చారు. ప్రధాన ద్వారం నుంచి సీఎం కేసీఆర్, మంత్రులు ప్రధానాలయ ప్రవేశం చేశారు. స్వయంభువుగా వెలసిన స్వామివారికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు తొలిపూజ చేశారు. తొలుత ఉపాలయాల్లోని ప్రతిష్ట మూర్తులకు మహా ప్రాణాన్యాసం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం గర్బాలయంలో మొదటి పూజ చేశారు. ఈ సందర్బంగా వేదపండితులు కేసీఆర్ దంపతులకు మహావేద ఆశీర్వచనం అందజేశారు. మొదటి తీర్థ ప్రసాద గోష్ఠిని సమర్పించారు.

ఈ కార్య‌క్ర‌మంలో సీఎం కేసీఆర్ కుటుంబ స‌భ్యులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప‌లువురు ప్రముఖులు, ఆల‌య అర్చ‌కులు, అధికారులు పాల్గొన్నారు. ఆల‌య పున‌ర్నిర్మాణంలో పాలు పంచుకున్న ఆల‌య ఈవో ఎన్ గీత‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ ఆనంద్ సాయి, స్థ‌ప‌తి సుంద‌ర్ రాజ‌న్, వైటీడీఏ వైస్ చైర్మ‌న్ కిష‌న్ రావును సీఎం కేసీఆర్ శాలువాల‌తో స‌త్క‌రించి, స‌న్మానించారు. ఆర్కిటెక్చ‌ర్ మ‌ధుసూద‌న్, ఈఎన్సీ ర‌వీంద‌ర్ రావు, గ‌ణ‌ప‌తిరెడ్డి, శంక‌ర‌య్య‌ల‌ను మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి, జీ వ‌సంత్ నాయ‌క్‌, వై లింగారెడ్డి, వెంక‌టేశ్వ‌ర్ రెడ్డిల‌ను మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, రామారావు, సుధాక‌ర్ తేజ‌ల‌ను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శాలువాల‌తో స‌త్క‌రించి స‌న్మానించారు. అనంత‌రం ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఆల‌య ఈవో గీత‌, వైటీడీఏ వైస్ చైర్మ‌న్ శాలువాతో స‌త్క‌రించి, నార‌సింహ స్వామి ఫోటోను బ‌హుక‌రించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/