ఆ పార్టీతో పొత్తు ఉండదు..మాయావతి

Mayawati

లక్నో: అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, సార్వత్రిక ఎన్నికల్లో గానీ బిజెపితో పొత్తు కుదుర్చుకోలేమ‌ని బీఎస్పీ నేత మాయావ‌తి స్పష్టం చేశారు. వీలైతే రాజ‌కీయాల నుంచే రిటైర్ అవుతాన‌న్నారు. బిజెపి, బీఎస్పీ మ‌ధ్య కూట‌మి ఉండ‌ద‌ని, భ‌విష్య‌త్తులో ఎప్పుడూ ఇలా జ‌ర‌గ‌ద‌ని, మ‌త‌వ‌ర్గ పార్టీతో బీఎస్పీ జ‌త‌క‌ట్ట‌ద‌ని ఈరోజు ఆమె మీడియాతో వెల్ల‌డించారు. స‌ర్వ‌జ‌న స‌ర్వ ధ‌ర్మ హితం అన్న‌ది త‌మ విధాన‌మ‌ని, ఇది బిజెపి సిద్ధాంతానికి వ్య‌తిరేకం అని మాయావ‌తి అన్నారు. మ‌తం, కులం, పెట్టుబ‌డి సిద్ధాంతాలు క‌లిగిన పార్టీతో బీఎస్పీ జోడీ క‌ట్ట‌ద‌ని ఆమె తెలిపారు.

భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లోనూ బిజెపి తో జట్టుకట్టడం సాధ్యం కాదు. మతతత్వ పార్టీలతో బీఎస్పీ స్నేహం చేయదు. సర్వజన సర్వధర్మ హితమే మా పార్టీ సిద్ధాంతం. ఇది బిజెపి సిద్ధాంతానికి పూర్తి విరుద్ధం. కాబట్టి కుల, మత, పెట్టుబడిదారీ సిద్ధాంతాలున్న వారితో బీఎస్పీ కూటమి కట్టడం జరగదు అని పేర్కొన్నారు. తాను అవసరమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటాననీ.. కానీ అలాంటి పార్టీల కూటమిలో మాత్రం చేరబోనని ఆమె తెగేసి చెప్పారు. కులతత్వ, మతతత్వ, పెట్టుబడిదారీ విధానాలతో కూడిన పార్టీలపై నా పోరాటం కొనసాగుతుంది. ఎప్పటికీ ఎవరి ముందు నేను మోకరిల్లేది లేదు అని మాయావతి పేర్కొన్నారు. మున్ముందు జరగబోయే మండలి ఎన్నికల్లో ఎస్పీ నిలబెట్టే రెండో అభ్యర్థిని ఓడించి తీరుతామని ఆమె స్పష్టం చేశారు.

అయితే సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు రాజ్యసభ ఎన్నికల్లో, మండలి ఎన్నికల్లో బిజెపి లేదా ఇతర అభ్యర్థులకు తాము ఓట్లు వేస్తామంటూ ఆమె గత వారంలో పేర్కొన్న విషయం తెలిసిందే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/