ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావడం ఎంతో ముఖ్యం: మంత్రి జైశంకర్

ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు.. ఇదే భారత్ నినాదం..జైశంకర్

jaishankar-speech-at-world-cultural-festivals

న్యూయార్క్‌ః ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనేది భారత్ నినాదం అని విదేశాంగ మంత్రి జైశంకర్ పునరుద్ఘాటించారు. అమెరికాలోని వాషింగ్టన్​లో ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌. జైశంకర్‌ ప్రసంగిస్తూ.. ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు.

సమష్టి జీవన విధానం మరింత మెరుగుపడిందని జై శంకర్ తెలిపారు. ప్రపంచంలో వాతావరణ మార్పు, ఆర్థిక పురోగతి, సామాజిక శ్రేయస్సువంటి పెద్ద సవాళ్లను ఒంటరిగా సమర్థవంతంగా పరిష్కరించలేమని… ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఈ విధానంలోనే భారత్‌ జీ20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టిందని చెప్పారు. భారత్ థీమ్‌ ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ను నేడు సాంస్కృతికంగా ఎంతో బాగా ప్రదర్శించామని వెల్లడించారు. ‘మా బాధ్యతలను నిర్వర్తించి.. స్థిరమైన అభివృద్ధి, హరిత వృద్ధి, డిజిటల్‌ డెలివరీలో నూతన శక్తిని నెలకొల్పామని చెప్పేందుకు గర్వపడుతున్నాను’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు.