‘హనుమాన్’ చూస్తూ మహిళ ఉద్వేగం

సంక్రాంతి బరిలో చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయం సాధించిన మూవీ హనుమాన్. వర్మ – తేజ కలయికలో తెరకెక్కిన ఈ చిత్రం ‘హనుమాన్’. అనేక భాషల్లో విడుదలై అన్నింటా భారీ విజయం సాధించింది. బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ ‘హనుమాన్’ సినిమా చూస్తూ ఓ మహిళ విచిత్రంగా ప్రవర్తించిన వీడియో వైరల్ అవుతోంది. క్లైమాక్స్ సమయానికి ఒక్కసారిగా సీటులో నుంచి పైకి లేస్తూ, పెద్దగా అరుస్తూ అలజడి సృష్టించింది. ఆమెకు ఫిట్స్ లేదా ఇతర అనారోగ్య సమస్యల వల్ల ఇలా జరిగిందని కొందరు చెబుతుంటే.. సినిమా చూసిన ఉద్వేగంలో అలా ప్రవర్తించిందని మరికొందరు వాదిస్తున్నారు. పూనకం వచ్చిందని మరికొందరు అంటున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఉప్పల్లో చోటుచేసుకుంది.

మరోవైపు ఈ మూవీ ఫై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. స్నేహితులతో కలిసి చిత్రాన్ని వీక్షించిన ఆయన.. దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. నిర్మాణ విలువలు, గ్రాఫిక్స్ ఉన్నతంగా ఉన్నాయన్నారు. తేజా, అమృత అయ్యర్, వరలక్ష్మి నటన ఆకట్టుకుందని ట్వీట్ చేశారు. సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.