హరియాణాలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఓ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

నార్త్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని వందల ఇల్లు నేలమట్టంకాగా , కోట్ల నష్టం వాటిల్లింది. ఇప్పుడిప్పుడే కాస్త వర్షాలు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో హరియాణాలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఓ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. సమస్యలు ఉన్నప్పుడు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికి బదులుగా ఇప్పుడు ఎందుకు వచ్చారని ఓ బాధితురాలు ఎమ్మెల్యే చెంపై చెళ్లుమనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ గుల్హా ప్రాంతంలోని వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. అయితే సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళ మరింత ఆగ్రహానికి లోనై వెంటనే ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ చెంపపై కొట్టింది. తమ ప్రాంతంలోని చిన్న జలాశయం గట్టు తెగిపోవడంతో తమ ప్రాంతమంతా వరదపాలైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అక్కడున్న ఉన్న పార్టీ నేతలు, పోలీసులు మహిళను నిలువరించారు.

ఇక ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ..ఇది ప్రకృతి వైపరీత్యమని, కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల ఈ విపత్తు సంభవించిందని మహిళకు నచ్చజెప్పానని అన్నారు. కానీ ఆ మహిళ తీవ్ర ఆగ్రహానికి గురై తనపై చేయి చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఆవేదనతోనే ఆమెను తనను కొట్టిందని.. ఈ విషయం గురించి తానేమీ పట్టించుకోవట్లేదని అన్నారు.