రాహుల్ గాంధీపై యూకే కోర్టులో దావా వేస్తా: లలిత్ మోదీ

అతడ్ని మూర్ఖుడిగా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానన్న లలిత్

Will Sue Gandhi In UK Court: Lalit Modi Threatens Rahul Gandhi Over Latter’s Remarks

న్యూఢిల్లీః ఐపీఎల్ వ్యవస్థాపకుడు, ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రంగా స్పందించారు. దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరు ఎలా వచ్చిందంటూ 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఎంపీగా అర్హత కోల్పోయారు. మోదీ ఇంటి పేరిట రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బ్రిటన్ కోర్టుకు అతడ్ని లాగుతానని లలిత్ మోదీ ప్రకటించారు. ట్విట్టర్ లో లలిత్ మోదీ వరుస ట్వీట్లు చేశారు.

‘‘గాంధీ సహచరులు నేను న్యాయవ్యవస్థ విచారణ నుంచి పారిపోయిన వాడినని పదే పదే అంటున్నారు. నేనేమీ దోషిగా ప్రకటించబడలేదు. కనుక సాధారణ పౌరుడినే. ప్రతిపక్ష నాయకులకు వేరే ఏ పనీ లేదు కనుక వారు తప్పుడు ప్రచారం లేదా ప్రతీకారాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రాహుల్ గాంధీపై యూకే కోర్టులో పోరాడాలని నిర్ణయించుకున్నాను. అతడు కొన్ని ఆధారాలతో వస్తాడని నమ్ముతున్నాను. అతడ్ని పూర్తి మూర్ఖుడిగా నిరూపించేందుకు నేను ఎదురు చూస్తున్నాను’’ అని లలిత్ మోదీ ప్రకటించారు.

పలువురు కాంగ్రెస్ నేతలకు విదేశాల్లో ఆస్తులున్నట్టు లలిత్ మోదీ పేర్కొన్నారు. చిరునామా, ఫొటోలను కూడా పంపిస్తానని చెబుతూ, భారత ప్రజలను వెర్రోళ్లను చేయవద్దని సూచించారు. ‘‘గాంధీ కుటుంబం మన దేశాన్ని పాలించే అర్హత వారికొక్కరికే ఉన్నదన్నట్టుగా తయారైంది. అవును. మీరు కఠినమైన చట్టాలను ఆమోదించిన వెంటనే నేను భారత్ కు తిరిగివస్తాను’’ అని లలిత్ మోదీ స్పష్టం చేశారు.