బ్రిటీష్ దురాగతాలపై బీబీసీ డాక్యుమెంటరీ ఎందుకు తీయలేదు?: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌

మన కోర్టుల తీర్పుల కన్నా.. డాక్యుమెంటరీని నమ్ముతున్న వారిని చూసి చింతిస్తున్నానని వ్యాఖ్య

Why no BBC Documentary on British Atrocities?.. Asks Kerala Governor Arif Mohd Khan Amid Row

తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పై స్పందించారు. బ్రిటీష్ దురాగతాలపై డాక్యుమెంటరీ ఎందుకు తీయలేదని ఆయన బీబీసీని ప్రశ్నించారు. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా బాగా రాణిస్తోందని, దీంతో విదేశీ డాక్యుమెంటరీ నిర్మాతలు నిరాశకు గురయ్యారని ఎద్దేవా చేశారు. న్యాయవ్యవస్థ తీర్పుల కన్నా.. ఆ డాక్యుమెంటరీని నమ్ముతున్న వారిని చూసి తాను చింతిస్తున్నానని ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆరిఫ్ ఖాన్.. “ఇది భారతదేశం జీ20 అధ్యక్ష పదవిని చేపట్టిన సమయం. ఈ డాక్యుమెంటరీని తీసుకురావడానికి ఈ నిర్దిష్ట సమయాన్నే ఎందుకు ఎంచుకున్నారు? ప్రత్యేకించి భారతదేశం తన స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేదని.. దేశం ముక్కలవుతుందని స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో అంచనా వేసిన వారి నుంచి వచ్చిన డాక్యుమెంటరీ ఇది’’ అని అన్నారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ దేశ విదేశాల్లో పెను దుమారమే రేపింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. డాక్యుమెంటరీకి సంబంధించిన లింకులను బ్లాక్ చేయాలని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ని ఆదేశించింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఈ డాక్యుమెంటరీని ప్రతిపక్షాలు, వాటి అనుబంధ విద్యార్థి సంఘాలు ప్రదర్శిస్తున్నాయి. దీంతో కొన్నిచోట్ల గొడవలు జరుగుతున్నాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/