భారత వ్యతిరేక శక్తులతో రాహుల్ కు సంబంధాలు ఏంటి? : బీజేపీ

ట్విట్టర్ పేజీలో నిలదీసిన బీజేపీ నేత మాలవీయ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ నేపాల్ రాజధాని ఖాట్మండులోని ఓ క్లబ్ లో గడిపిన వీడియోను బీజేపీ బయటపెట్టడం.. ఇందులో తప్పు ఏముందంటూ కాంగ్రెస్ విరుచుకుపడడం చూశాం. దీనిపై బీజేపీ సోషల్ మీడియా చీఫ్ అమిత్ మాలవీయ కీలక ప్రశ్నలు సంధించారు. భారత వ్యతిరేక శక్తులతో రాహుల్ కు సంబంధాలు ఏంటి? అని నిలదీశారు.

రాహుల్ గాంధీ నేపాల్ లో తన స్నేహితురాలి వివాహానికి వెళ్లినట్టు కాంగ్రెస్ వివరణ ఇచ్చుకుంది. ‘‘రాహుల్ గాంధీ తన స్నేహితురాలు అని చెప్పుకుంటున్న సుమ్నిమా ఉదాస్ వివాహానికి హాజరయ్యారు. ఆమె నేపాలీ దౌత్యవేత్త కుమార్తె. భారత్ లో భాగమైన ఉత్తరాఖండ్ లోని సరిహద్దు ప్రాంతాలు తమవి అంటూ నేపాల్ చేస్తున్న వాదనలకు మద్దతు పలికే వ్యక్తి. చైనా నుంచి నేపాల్ వరకు, భారత ప్రాదేశిక సమగ్రతను ప్రశ్నిస్తున్న వారితోనే రాహుల్ ఎందుకు సంబంధాలు నెరుపుతున్నారు?’’ అంటూ అమిత్ మాలవీయ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

మాలవీయ తన ట్విట్టర్ పేజీలో ఇందుకు సంబంధించి కీలక క్లిప్ లను కూడా జతపరిచారు. భారత్ లోని సరిహద్దు ప్రాంతాలు తమవిగా చూపిస్తూ నేపాల్ ఆ మధ్య మ్యాప్ విడుదల చేయడం తెలిసిందే. దీన్ని ఎన్నో దశాబ్దాల క్రితమే చేసి ఉండాల్సిందంటూ సుమ్నిమా ఉదాస్ పెట్టిన పోస్ట్ కూడా ఇందులో ఉంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/