జ‌గ్గారెడ్డి ఎవ‌రు..? అని ప్రశ్నించిన షర్మిల

YSRTP అధినేత్రి వైస్ షర్మిల – సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ప్ర‌జా ప్ర‌స్థానం యాత్ర‌లో భాగంగా సంగారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్న ష‌ర్మిల‌… అక్క‌డి స్థానిక ఎమ్మెల్యే హోదాలో ఉన్న జ‌గ్గారెడ్డిపై విమ‌ర్శ‌లు గుప్పించగా..ఆ విమర్శలకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చ‌నిపోయిన సంద‌ర్భంగా జ‌గ‌న్ ఫ్యామిలీ అస‌లు బాధ ప‌డ‌లేద‌ని, త‌దుప‌రి సీఎం ఎవ‌ర‌న్న దిశ‌గా ఆలోచ‌న‌లో మునిగిపోయింద‌ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు.

నేడు పటాన్ చెరువు నియోజకవర్గం జిన్నారంలో షర్మిల పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్బంగా ఏర్పటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. జ‌గ్గారెడ్డి చాలెంజ్‌కు తాను భ‌య‌ప‌డ‌బోన‌ని , జ‌గ్గారెడ్డి చెబుతున్న‌వ‌న్నీ అబ‌ద్ధాలేన‌ని షర్మిల అన్నారు. త‌న తండ్రి చ‌నిపోయిన రోజు జ‌గ్గారెడ్డి ప‌రామ‌ర్శ‌కు వ‌స్తే తాము రాజ‌కీయాలు మాట్లాడామ‌ని ఆయ‌న అన్నార‌ని ష‌ర్మిల మండిప‌డ్డారు. నాడు త‌మ కుటుంబం ప‌డిన బాధ త‌మ‌కే తెలుసున‌న్నారు. అస‌లు తాము బతుకుతామా? చ‌స్తామా? అన్న‌ట్లుగా బాధ‌ప‌డ్డామ‌న్నారు. అస‌లు త‌న‌కు చాలెంజ్ విస‌ర‌డానికి జ‌గ్గారెడ్డి ఎవ‌రు? అని కూడా ష‌ర్మిల ప్ర‌శ్నించారు. మంత్రి త‌న‌పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా కూడా తాను భ‌య‌ప‌డలేద‌న్నారు. రాజ‌శేఖ‌ర‌రెడ్డి బిడ్డ‌గా తాను ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌బోన‌న్నారు. ద‌మ్ముంటే త‌న‌ను అరెస్ట్ చేయాల‌ని సంకెళ్లు చూపించి మ‌రీ తాను స‌వాల్ విసిరాన‌ని తెలిపారు.