ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌

శ్రీ‌వారి భ‌క్తుల కోసం ఏర్పాటు చేసిన ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. తిరుమల పర్యటన లో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మంగళవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికిచేరుకున్నారు. తొలుత తిరుపతి తాతయ్యగుంట ప్రాంతంలోని గంగమ్మ ఆలయాన్ని సందర్శించి , అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. సీఎం రాకతో గంగమ్మ ఆలయం వద్ద భారీ కోలాహలం నెలకొంది. ఆలయ వర్గాలు సీఎం జగన్ కు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకునేందుకు తిరుమ‌ల కొండ‌కు వ‌చ్చే భ‌క్తుల కోసం టీటీడీ ఏర్పాటు చేసిన ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను అలిపిరి వ‌ద్ద జెండా ఊపి జగన్ ప్రారంభించారు.

అధునాతన సౌకర్యాలతో భక్తులకు ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. మ‌రి కాసేప‌ట్లో శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో జ‌గ‌న్ పాల్గొంటారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామికి ప‌ట్టువ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించ‌నున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. కాగా, రేణిగుంట విమానాశ్రయంలో సీఎం జగన్ కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఎంపీలు గురుమూర్తి, రెడ్డప్ప, ఎమ్మెల్యేలు, నేతలు స్వాగతం పలికారు.