వైట్‌హౌజ్‌లో కొకైన్‌ కలకలం

White House
White House

వాషింగ్ట‌న్ : అమెరికా శ్వేతసౌధం లో కొకైన్ మాద‌క‌ద్ర‌వ్యాన్ని గుర్తించారు. ఇటీవ‌ల ఓ తెల్ల‌టి ప‌దార్ధాన్ని అధికారులు ప‌సిక‌ట్టారు. అయితే సీక్రెట్ స‌ర్వీస్ ఏజెంట్లకు ఆ పౌడ‌ర్ దొరికింది. వైట్‌హౌజ్‌లోని వెస్ట్ వింగ్ ప్రాంతంలో దాన్ని సీజ్ చేశారు. ఆ త‌ర్వాత ఆ కాంప్లెక్స్‌లో ఉన్న వారిని మ‌రో ప్ర‌దేశానికి త‌ర‌లించారు. కొకైన్‌ను గుర్తించిన స‌మ‌యంలో.. వైట్‌హౌజ్‌లో ప్రెసిడెంట్ బైడెన్ లేరు. ఆ స‌మ‌యంలో ఆయ‌న త‌న వీకెండ్‌ను క్యాంప్ డేవిడ్ లో గ‌డుపుతున్నారు. ఫైర్ అండ్ ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసు సిబ్బంది ఆ తెల్ల‌టి పౌడ‌ర్‌ను ప‌రీక్షించారు. ప్రాథ‌మిక ప‌రీక్ష‌లో ఆ పౌడ‌ర్ కొకైన్ అని తేలింది.

వైట్ పౌడ‌ర్ ప్యాకెట్‌ను మ‌రింత టెస్టింగ్ కోసం పంపించారు. అయితే ఆ పౌడ‌ర్ ఎలా వైట్‌హౌజ్ లోకి ఎంట‌రైంద‌న్న దానిపై సీక్రెట్ స‌ర్వీస్ ఏజెంట్లు ద‌ర్యాప్తు చేస్తున్నారు. వైట్‌హౌజ్ వెస్ట్ వింగ్ అధ్య‌క్ష భ‌వ‌నానికి స‌మీపంలో ఉంటుంది. ఓవ‌ల్ ఆఫీస్‌, క్యాబినెట్ రూమ్‌, ప్రెస్ రూమ్‌లు కూడా అక్క‌డే ఉన్నాయి. అయితే వెస్ట్ వింగ్ వ‌ద్ద‌కు ప్ర‌తి రోజు ప‌నుల కోసం వంద‌ల సంఖ్య‌లో జ‌నం వ‌స్తుంటారు.