నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు

telangana-assembly

హైదరాబాద్ః తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు ఈరోజు ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. దాదాపు ఆరు నెలల తర్వాత సమావేశాలు జరుగుతుండడంతో అధికార, విపక్షాలు దృష్టి సారించాయి.తొలిరోజు ప్రశ్నోత్తరాలు ఉండవు. సంతాప తీర్మానాల అనంతరం శాసనసభ వాయిదా పడుతుంది. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయుధ పోరాట యోధులు మల్లు స్వరాజ్యం, కమలాపూర్‌ మాజీ ఎమ్మెల్యే పరిపాటి జనార్దన్‌రెడ్డిలకు నివాళి అర్పిస్తారు. శాసనమండలిలో తొలిరోజు గోదావరి పరివాహక ప్రాంతంలో ఇటీవల భారీ వర్షాలు, వరదలతో సంభవించిన నష్టాల అంశంపై స్వల్పకాలిక చర్చ జరుపుతారు. అనంతరం శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ)ల సమావేశం జరుగుతుంది. ఇందులో ఈ విడతలో పనిదినాలు, ఎజెండా ఖరారు కానుంది. ఈ నెల 6, 12, 13 తేదీల్లో మూడు రోజుల పాటు సభ జరుగుతుందని తెరాస శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ తెలిపారు. ఈ సమావేశాల్లో పురపాలక చట్టసవరణ సహా ఆరు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలి? వంటి అంశాలపై బీఏసీలో నిర్ణయించనున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రాత్సవాల సందర్భంగా ఈ నెల 16, 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి కొనసాగింపుగా మండలి, శాసనసభల్లో విస్తృతంగా చర్చించే అవకాశం ఉన్నది. దళితబంధును ప్రస్తుతం నియోజకవర్గాలవారీగా అందచేస్తున్న 100 కుటుంబాలకు అదనంగా మరో 500 మందికి ఈ పథకాన్ని విస్తరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపైనా సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశాలున్నాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/