వాటర్‌ ట్యాంక్‌లో దొరికిన మృతదేహం ఎవరిదో తేల్చిన పోలీసులు..

హైదరాబాద్ లోని ముషీరాబాద్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హరినగర్ రీసాలగడ్డ వాటర్ ట్యాంక్‌లో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి వచ్చిన వాటర్ వర్క్స్ సిబ్బందికి మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహం ఎవరిదీ అనేది తెలుసుకునేపనిలో పడ్డారు. ఈ తరుణంలో ఆ మృతదేహం ఎవరిదో తేల్చారు పోలీసులు.

చనిపోయిన వ్యక్తి చిక్కడపల్లికి చెందిన కిషోర్‌గా గుర్తించారు. కొన్నిరోజులుగా గంజాయి, మద్యానికి బానిస అయ్యాడని అంటున్నారు. చనిపోయే ముందు కుటుంబీకులతో గొడవ పడినట్లుగా తెలుస్తోంది. కాబట్టి.. ప్రస్తుతం దీన్ని సూసైడ్‌గా భావిస్తున్నారు. కిషోర్‌ మిస్సయినట్లు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఇక శవం ఉన్న ట్యాంకు నీళ్లను కొన్ని రోజులుగా ప్రజలకు సరఫరా చేస్తూవచ్చారు. శవం సంగతి తెలియడంతో ఆ నీళ్లను తాగిన ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆ శవం ఎన్నిరోజుల నుంచి ట్యాంకులో ఉందో అంటూ వారు చర్చించుకుంటున్నారు.