వరంగల్ జిల్లాలో బ్లేడుతో గొంతు కోసుకున్న వీఆర్ఏ ..

ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ మనస్థాపానికి గురైన వీఆర్ఏ బ్లేడుతో గొంతు కోసుకున్న ఘటన వరంగల్ జిల్లా గుండ్రపల్లిలో జరిగింది. వేతన సవరణ, పదోన్నతులు సహా పలు డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలు 69 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వీఆర్ఏలు దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇప్పటికే పలువురు వీఆర్ఏ లు ఆత్మహత్య లు చేసుకోగా, తాజాగా ఖాసిం అనే వీఆర్ఏ నెక్కొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన దీక్షా శిబిరం వద్ద బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

వెంటనే అప్రమత్తమైన సహచర వీఆర్ఏలు అతడిని అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోరుతూ నెలల తరబడి దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. ప్రస్తుతం ఖాసీం హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.