పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి

తన తమ్ముడు విజయం కోసం అన్న మెగా స్టార్ చిరంజీవి రంగంలోకి దిగాడు. ఇప్పటికే కూటమికి తన సంపూర్ణ మద్దతు తెలిపిన చిరంజీవి..ఈరోజు పిఠాపురం ప్రజలు తన తమ్ముడ్ని గెలిపించి , అసెంబ్లీ పంపించాలని కోరారు. సోషల్ మీడియా వేదికగా తన సందేశాన్ని తెలిపారు.

“కొణిదెల పవన్ కల్యాణ్. అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టినా అందరికీ మంచి చేయాలని మేలు జరగాలని విషయంలో ముందువాడుగానే ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువ ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కల్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలని అనుకుంటారు. కానీ కల్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దుల దగ్గర ప్రాణాలు ఒడ్డి పోరాడే జవానుల కోసం పెద్ద మొత్తంలో ఇవ్వడం, అలాగే మత్స్యాకారులు ఇలా ఎందరికో తను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది.

ఒక రకంగా చెప్పాలంటే సినిమాల్లోకి తను బలవంతంగా వచ్చాడు. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరక్కుపోతుంది. ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఓ మాట చెప్పాను. ఎంతో మంది తల్లుల కోసం వారి బిడ్డల భవిష్యత్‌ కోసం చేసే యుద్ధం అని నా తల్లికి చెప్పాను. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వారి వల్ల ప్రజాస్వామానికి మరింత నష్టం అని నమ్మి జనం కోసం జనసైనికుడు అయ్యాడు. తను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశాలి పవన్. ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే… చట్టసభల్లో అతని గొంతును మనం వినాలి.

జనమే జయం అని నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలి అంటే మీరు పిఠాపురం ప్రజలు కల్యాణ్‌ గెలిపించాలి. మీకు సేవకుడిగా ,సైనికుడిగా అండగా నిలబడతాడు. మీకు ఏమైనా సరే కాపాడతాడు. మీ కలలను నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం గాజు గ్లాసు గుర్తుకు మీ ఓటు వేసి పవన్ కల్యాణ్‌ను గెలిపించండి. ” అని తన వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో చిరంజీవి పోస్టు చేశారు.

ఏపీలో మరో ఐదు రోజుల్లో పోలింగ్ జరగనుంది..ఈ క్రమంలో అందరి చూపు పిఠాపురం పైనే ఉంది. ఈసారి పవన్ కళ్యాణ్ అక్కడి నుండి పోటీ చేస్తుండడం తో ఎవరి పవన్ విజయం సాధిస్తారా..లేదా అని మాట్లాడుకుంటున్నారు. వైసీపీ నుండి వంగా గీత బరిలోకి దిగితే..కూటమి నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓటమి చెందిన పవన్ కళ్యాణ్..ఈసారి పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే అనేక సర్వేలు పిఠాపురంలో పవన్ భారీ మెజార్టీ తో గెలుపొందుతున్నారని చెపుతున్నాయి. అయినప్పటికీ తమ వంతుగా మెగా ఫ్యామిలీ (Mega Family) , పవన్ కళ్యాణ్ ను అభిమానించే నటి నటులు తమ వంతుగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తూ వస్తున్నారు. ప్రతి ఇంటిగడపకు వెళ్లి గాజు గ్లాస్ కు ఓటు వేయాలని కోరుతున్నారు. వరుణ్ తేజ్ , సాయి తేజ్ , వైష్ణవ్ తేజ్ లు ప్రచారం చేయగా..ఇక ఇప్పుడు అన్నయ్య మెగా స్టార్ చిరంజీవి తమ్ముడి కోసం రంగంలోకి దిగారు.