కరోనా అంతమైనా.. అలాంటి ముప్పు మరొకటి రానుంది! : బిల్ గేట్స్
వృద్ధులు, భారీకాయులు, షుగర్ వ్యాధిగ్రస్తులపైనే ఎక్కువ ప్రభావమట

వాషింగ్టన్: కరోనా వైరస్.. ప్రాణాలు తీసే మహమ్మారి. యావత్తు ప్రపంచ దేశాలను ఈ వైరస్ ఎలా గడగడలాడించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్లాది మందికి సోకిన ఈ వైరస్.. లక్షలాది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. తొలి వేవ్‌లో కొన్ని దేశాల్లో బీభత్సం సృష్టించింది. అయితే ఈ వైరస్ నుంచి రక్షణ కల్పించేందుకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు, జనంలో పెరిగిన అవగాహన, ముందు జాగ్రత్త చర్యలు ఇందుకు కారణమని చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో ఇక కరోనా ఖతమైనట్టేనన్న భావన అందరిలోనూ వ్యక్తమవుతున్నా .. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక వాక్యాలు చేశారు. కరోనా అంతమైనా.. అలాంటి ముప్పు మరొకటి రానుందని అన్నారు.
ఇటీవలే ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించిన గేట్స్.. కరోనా లాంటి ముప్పు మరొకటి తప్పదని డేంజర్ బెల్స్ మోగించారు. అయితే ఆ రానున్న ముప్పు కరోనా వైరస్ జాతి నుంచి కాకుండా ఇంకో వేరే రకమైన వైరస్ కారణంగా తలెత్తవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే ఇప్పటికే కరోనా కారణంగా మనలో విస్తృతంగా వృద్ధి చెందిన యాంటీబాడీలు, అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల కారణంగా ఆ కొత్త ముప్పు కరోనా అంతటి విలయాన్ని అయితే కల్పించే అవకాశాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కొత్త ముప్పు ప్రధానంగా వృద్ధులు, ఒబెసిటీతో బాధపడేవారు. డయాబెటిక్ రోగులపై పడనుందని కూడా ఆయన అంచనా వేశారు. ఇక వైద్య రంగంలో నానాటికీ అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కూడా ఈ కొత్త ముప్పును నిలువరించే అవకాశాలున్నాయని గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక కరోనా నివారణ కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ లక్ష్యాలపై స్పందించిన గేట్స్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన 70 శాతం మందికి ఈ ఏడాది మధ్య నాటికి వ్యాక్సిన్ అందించే అవకాశాలు అయితే కనిపించడం లేదని సంచలన వ్యాఖ్య చేశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/