ఈ నెల 15 నుంచి ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమం

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమం నిర్వహించనుంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో CM జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పనితీరు ఆధారంగా 3 కేటగిరీల్లో అవార్డులు ప్రదానం చేయనున్నారు. కనీసం ఏడాది నిరాటంకంగా పనిచేసిన వాలంటీర్ అర్హులని ప్రభుత్వం పేర్కొంది. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పురస్కారాలతో పాటు గరిష్ఠంగా రూ.30 వేల వరకు నగదు పురస్కారం ఇవ్వనున్నారు.

ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్.. ఏపీలో వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చారు సీఎం జగన్. పౌరసేవలను ప్రజల ఇళ్లవద్దకే చేర్చాలనే ఉద్దేశంతో సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్‌ను నియమించారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల లబ్ధిని ఈ వాలంటీర్లు అర్హులకు చేరవేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వాలంటీర్లకు వందనం పేరుతో వారిని ప్రభుత్వం సత్కరిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని వాలంటీర్లకు సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పేరుతో అవార్డులు, నగదు పురస్కారం అందిస్తోంది. ఇప్పటి వరకూ మూడుసార్లు వీటిని అందించగా.. నాలుగో ఏడాది గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం వేదికగా ఫిబ్రవరి 15న సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రాష్ట్రమంతటా అసెంబ్లీ నియోజకవర్గాలు వారీగా ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో ఆ ప్రాంత వాలంటీర్లను సత్కరించే కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

వాలంటీర్లకు వందనం పేరుతో నిర్వహిస్తున్న నాలుగో ఏడాది కార్యక్రమంలో భాగగా 2,55,464 మంది వాలంటీర్లను సత్కరించనున్నారు. వీరిలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సేవా వజ్ర, సేవా రత్న అవార్డులతోను, నిరాటంకంగా ఏడాది పని చేసిన వారికి సేవా మిత్ర అవార్డుతో సత్కరించి నగదు బహుమతి అందించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున మొత్తం 875 మందికి వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డును ఇవ్వనున్నారు. ప్రతి మండలంలో, మున్సిపాలిటీలో ఐదుగురు చొప్పున 4,150 మందికి సేవా రత్న అవార్డును ఇవ్వనున్నారు. కనీసం ఏడాదిపాటు పని చేసిన మిగిలిన 2,50,439 మంది వాలంటీర్లకు సేవామిత్ర అవార్డును అందించనున్నారు.