సాయంత్రంలోగా విశాఖను విడిచిపోవాలంటూ పవన్ కు పోలీసులు నోటీసులు

సాయంత్రం 4 గంటలోపు పవన్ కల్యాణ్ తో పాటు జనసేన కీలక నేతలు విశాఖను విడిచిపోవాలంటూ విశాఖ పోలీసులు సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులు జారీ చేశారు. విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎయిర్‌పోర్ట్‌ వద్ద మంత్రులపై దాడి కేసులో జనసేన కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారని , వెంటనే తమ పార్టీ కార్యకర్తలను విడిచిపెట్టాలని, అప్పటివరకు విశాఖను వదిలి వెళ్లిపోనంటూ పవన్ పేర్కొన్నారు.

పవన్ బయటకు వస్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి శాంతిభద్రల సమస్య ఏర్పడే అవకాశం ఉండటంతో విశాఖ విడిచి వెళ్లిపోవాల్సిందిగా పవన్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సాయంత్రం నాలుగు గంటలలోగా విశాఖను విడిచి వెళ్లాలని ఏసీపీ హర్షిత పవన్‌కు 41ఏ నోటీసులు అందించారు. పవన్ కు 41ఏ నోటీసులు అందించడంతో విశాఖను వదిలి వెళ్లపోతే అరెస్ట్ చేసే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. పవన్‌తో పాటు పలువురి జనసేన నేతలకు కూడా విశాఖ నుంచి వెళ్లాల్సిందిగా 41ఏ నోటీసులిచ్చారు. ఈ నెలాఖరు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని ,సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, ర్యాలీలకు ఎలాంటి అనుమతిలేదని తెలిపారు.