కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి

బిజెపి పార్టీకి రాజీనామా చేసిన విజయశాంతి..ఈరోజు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను ఖర్గే పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ లో విజయశాంతి చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నేతలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. గతంలో కాంగ్రెస్ నుంచి విజయశాంతి బీజేపీలోకి వెళ్లారు. కానీ కొన్ని రాజకీయ కారణాల దృష్ట్యా విజయశాంతి బీజేపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. మోడీ సభలకు కూడా హాజరు కావడం లేదు. అప్పటి నుంచే కొన్ని అనుమానాలు తలెత్తాయి. ఆ అనుమానాలను నిజం చేస్తూ ఆమె బిజెపి రాజీనామా చేసి , నేడు కాంగ్రెస్ లో చేరారు.

తెలంగాణ ఎన్నికల కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల చేసేందుకు మల్లిఖార్జున ఖర్గే హైదరాబాద్ వచ్చారు. గాంధీ భవన్ లో మ్యానిఫెస్టో విడుదల తర్వాత ఆయన బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకున్నారు. అక్కడ మల్లికార్జున్ ఖర్గే తో విజయశాంతి భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విజయశాంతికి ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఎంపీగా బరిలోకి దించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారానికి పరిమితం కానున్నారు.