మనవరాలి వయసు యువతితో ఆ ప్రశ్నలు ఏంటి?: ఫరూక్ అబ్దుల్లాను తప్పుబట్టిన బిజెపి

పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్? నీవే చూసుకుంటావా? అంటూ అబ్దుల్లా ప్రశ్న

video-of-farooq-abdullah-asking-reporter-marriage-question-viral-bjp-responds

న్యూఢిల్లీః నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూ అండ్ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా 85 ఏళ్ల వయసులోనూ ఓ మహిళా రిపోర్టర్ ను చిలిపి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు. ఈ వైఖరిని బిజెపి నేత అమిత్ మాలవీయ తప్పుబట్టారు. తన ఎదుట పడిన మహిళా జర్నలిస్ట్ తో.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్? అని ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. అంతటితో ఆగి పోలేదు. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరిన్ని ప్రశ్నలు సంధించి ఇబ్బందికి గురిచేశారు. అంతేకాదు మధ్య మధ్యలో ఆమె చేతిని తడుముతూ మాట్లాడారు. దీనిపై బిజెపి నేత అమిత్ మాలవీయ స్పందిస్తూ ట్విట్టర్ లో ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.

రిపోర్టర్ వయసు ఆయన మనవరాలితో సమానం. లేదా అంతకంటే తక్కువే. అయినా.. ఎప్పుడు నీవు పెళ్లి చేసుకుంటావు? నీవు భర్తను ఎంపిక చేసుకున్నావా? మీ తల్లిదండ్రులు చూస్తారా? లేక నీవు చూసుకుంటావా? నీ చేతులపై ఈ మెహెందీ ఎందుకు ఉంది? వంటి అసౌకర్యకరమైన ప్రశ్నలు వేయకుండా ఆయన్ను నిలువరించలేకపోయింది. ఆమె తన సోదరుడి వివాహం అని చెప్పగా.. అతని భార్య అతడితోనే ఉంటుందా? లేక వదిలేసి వెళుతుందా? అని అబ్దుల్లా అడిగారు. నీవు పెళ్లి చేసుకున్నట్టయితే? అని అబ్దుల్లా మళ్లీ ప్రశ్నించారు. దీనికి ఆమె ‘సర్ నేను చాలా చిన్న దాన్ని ఇప్పుడు’అని బదులిచ్చింది. దానికి మళ్లీ అబ్దులా స్పందిస్తూ ఎవరిని పెళ్లి చేసుకుంటావో జాగ్రత్త పడు. ఎవరికి తెలుసు అతడు మహిళలతో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో.. నీకు తెలియకపోవచ్చు అంటూ అబ్దుల్లా వేసిన ప్రశ్నలను మాలవీయ తన ట్విట్టర్ పోస్ట్ లో ఉదహరించారు.