యోగి ‘డైనమిక్ సీఎం’ అంటూ ప్రధాని ప్రశంసలు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫై ప్రధాని మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. ఈరోజు యోగి 50 వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా పార్టీ నేతలు , కార్య కర్తలు , అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ యోగి ఆదిత్యనాథ్ ను ‘డైనమిక్ సీఎం’అని ప్రశంసించారు.

యోగి నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో నూతన శిఖరాలను చేరుకున్నట్టు ప్రకటించారు. ‘‘రాష్ట్ర ప్రజలకు ప్రజా అనుకూల పాలనకు భరోసా ఇచ్చారు. దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించి ప్రజల కోసం సేవ చేయాలి’’అంటూ ప్రధాని మోదీ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం ట్విట్టర్ ద్వారా విష్ చేశారు. ‘‘ఉత్తరప్రదేశ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి పూర్తి అధికారం, వ్యూహంతో పనిచేస్తున్నారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సంక్షేమం కోసం విరామం లేకుండా అంకితభావంతో పనిచేస్తున్నారు’’అని రాజ్ నాథ్ ట్వీట్ చేశారు. 1972 జూన్ 5న ఆదిత్యనాథ్ జన్మించారు.

బీఎస్పీ అధినేత్రి మాయావతి సైతం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీకి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు’’అని మాయావతి ప్రకటించారు.