తెలంగాణలో నేడు, రేపు అతి భారీ వర్షాలు

చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు

హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని, దీని ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా గుజరాత్‌లోని కచ్ వరకు ఉపరిత ద్రోణి ఆవరించిందని, మరోవైపు రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. వర్షాలు పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది.

కాగా, గత రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. సిరిసిల్ల రాజన్న జిల్లా పెద్దూరులో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 5 డిగ్రీల వరకు తగ్గాయి. ఫలితంగా వాతావరణం బాగా చల్లబడింది. గాలిలో తేమ పెరిగింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/