సెట్స్ పైకి వరుణ్ తేజ్ 13 వ చిత్రం

హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. రీసెంట్ గా గని , రంగ రంగ వైభవంగా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచాడు. ప్రస్తుతం తన 13 వ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. VT13 చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. గతంలో యాడ్-ఫిల్మ్ మేకర్ గా సినిమాటోగ్రాఫర్ గా కూడా పని చేసిన ప్రతాప్ సింగ్.. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

భారత వైమానిక దళం స్ఫూర్తితో ఓ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించనున్నారు. సోనీ పిక్చర్స్ వారు ఇటీవల ‘మేజర్’ వంటి బ్లాక్ బస్టర్ అందుకోగా.. వరుణ్ ఇంతకముందు రినైసన్స్ పిక్చర్స్ బ్యానర్ లో ‘గని’ మూవీ చేసాడు. వరుణ్ తేజ్ తన 13వ చిత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. మెగా ప్రిన్స్ ఈ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో తన అరంగేట్రం చేయనున్నాడు. ఈ సందర్బంగా చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ ను అధికారికంగా విడుదల చేశారు. ఇందులో వరుణ్‌ తేజ్‌ ఒక ఏయిర్‌ వింగ్ కమాండర్‌ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ ఫొటోతో పాటు.. ‘ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అవధులు లేని ధైర్య సాహసాలు, శౌర్యాన్ని సంబరాలు జరుపుకుంటున్నాయి. ఆకాశంలో జరిగే యుద్ధాన్ని వెండితెరపై చూసేందుకు సిద్ధంగా ఉండండి’ అంటూ రాసుకొచ్చారు.