ది కేరళ స్టోరీ పై వర్మ వరుస ట్వీట్స్

చిన్న సినిమాగా థియేటర్ల లోకి వచ్చిన ది కేరళ స్టోరీ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఈ సినిమా చూసేందుకు జనం థియేటర్ల బాట పడుతున్నారు. దీంతో ఈ సినిమా కలెక్షన్ల ప్రవాహం చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఈ తరుణంలో వర్మ ఈ మూవీ ఫై వరుస ట్వీట్స్ చేసారు.

“ఇతరులకు అబద్ధాలు చెప్పుకోవడంలో మనం ఎంత హాయిగా ఉంటామో, మనకు ఎవరైనా నిజం చూపిస్తే షాక్ అవుతాం. ఇప్పుడు ది కేరళ స్టోరీ సక్సెస్ పై బాలీవుడ్ అలాగే సైలెంట్ గా ఉంది. ది కేరళ స్టోరీ సినిమా బాలీవుడ్ అగ్లీనెస్ ని చూపించే ఓ అందమైన దయ్యం లాంటిది. ఇప్పుడు బాలీవుడ్ ప్రతి స్టోరీ డిస్కషన్ రూమ్ లో.. ది కేరళ స్టోరీ సినిమా వాళ్ళను వెంటాడుతుంది. ది కేరళ స్టోరీ సినిమాను చూసి బాలీవుడ్ నేర్చుకోవడం కష్టం. ఎందుకంటే అబద్దాన్ని ఎవరైనా ఈజీగా కాపీ చేయొచ్చు, కానీ నిజాన్ని కాపీ చేయడం కష్టం అని ట్వీట్ చేసారు.

ఇక ఈ మూవీ విషయానికి వస్తే..కేరళలో లవ్ జిహాద్ పేరుతో ఇతర మతాల అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి.. వారిని ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుకోవడం, వారిపై అకృత్యాలకు పాల్పడటం.. ఈ నేపథ్యంలో హార్డ్ హిట్టింగ్‌గా ఈ సినిమా తీయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో సినిమాపై నిషేధం పడింది. స్వయంగా మల్లీప్లెక్సులు ఈ చిత్ర ప్రదర్శనను ఆపేశాయి. కానీ అందుబాటులో ఉన్న చోట మాత్రం సినిమా అదిరే వసూళ్లతో దూసుకెళ్తోంది. తొలి రోజే రూ.10 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసిన ‘ది కేరళ స్టోరీ’.. వీకెండ్, వీక్ డేస్ అని తేడా లేకుండా దూసుకెళ్తోంది.

ఈ చిత్రం మూడో వీకెండ్లోనూ ఒక కొత్త సినిమాలా కలెక్షన్లు తెస్తోంది. ఈ శుక్రవారం ‘కేరళ స్టోరీ’ దేశవ్యాప్తంగా రూ.6 కోట్లు రాబడితే.. మరుసటి రోజు వసూళ్లు రూ.9 కోట్లకు పెరిగాయి. ఆదివారం కూడా ఇదే రేంజిలో వసూళ్లు ఉంటాయని భావిస్తున్నారు.