బైడెన్ పై విరుచుకుపడుతున్న యూఎస్ మీడియా!

అమెరికా మీడియా కంటే భారత్ మీడియా మెరుగన్న బైడెన్

వాషింగ్టన్ : భారత ప్రధాని నరేంద్రమోడీ తో సమావేశం సందర్భంగా సొంత దేశ మీడియాను ఉద్దేశించి బైడెన్ మరోసారి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీనిపై అమెరికా మీడియా భగ్గుమంది. శుక్రవారం బైడెన్ మాట్లాడుతూ.. తమ సొంత దేశ మీడియా కంటే ఇండియన్ మీడియా చాలా మెరుగ్గా ప్రవర్తించిందని అన్నారు.

శ్వేతసౌధంలో మోడీ తో ద్వైపాక్షిక చర్చలకు ముందు బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చల కోసం ఓవల్ కార్యాలయంలోకి వెళ్తూ.. వారు (మీడియా) ఏం చేయబోతున్నారో ప్రెస్‌లో చెప్పాలని అనుకుంటున్నానని బైడెన్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయన తన వ్యాఖ్యలను కొనసాగిస్తూ ‘‘అమెరికా మీడియాతో పోలిస్తే భారత మీడియా చాలా మెరుగ్గా ప్రవర్తించింది. మీరు ఓకే అంటే కనుక మనం వారి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఉందాం. ఎందుకంటే వారికి ఎప్పుడు ఏం అడగాలో తెలియదు’’ అంటూ మీడియాకు దొరికిపోయారు.

ఇండియా మీడియా ఎదుట తమ పరువును బైడెన్ మంటగలిపారంటూ గుర్రుగా ఉన్న యూఎస్ మీడియా నిన్న బైడెన్ అధికార ప్రతినిధి జెన్ పిసాకి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆమె ఈ విషయాన్ని తేలిగ్గా తీసిపడేశారు. బైడెన్ ఉద్దేశం అదికాదని కొట్టిపడేస్తూ అధ్యక్షుడికి అండగా నిలిచారు. అంతేకాదు, అమెరికా మీడియా ప్రతినిధులు సంబంధం లేని ప్రశ్నలు అడిగిన విషయం తన దృష్టికి కూడా వచ్చిందన్నారు.

మరో రిపోర్టర్ మాట్లాడుతూ.. ఇండియా-అమెరికా మీడియా మధ్య పోలిక తీసుకురావడాన్ని తప్పుబట్టారు. మీడియా స్వేచ్ఛ విషయంలో భారత మీడియా 142వ ర్యాంకులో ఉందని, అలాంటి మీడియాతో తమకు పోలికేంటని మండిపడ్డారు. అయితే, పిసాకి మాత్రం బైడెన్ వ్యాఖ్యలను సమర్థించారు. అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నోసార్లు మీడియాతో మాట్లాడారని గుర్తు చేశారు. నేటితో సహా దాదాపు 140 సార్లు బైడెన్ మీడియాతో మాట్లాడారని పేర్కొన్నారు. మీడియా పాత్రను, మీడియా స్వేచ్ఛను బైడెన్ గౌరవిస్తారని పిసాకి వివరించారు. కాగా, మీడియా స్వేచ్ఛలో అమెరికా 44వ స్థానంలో ఉంది. బుర్కినా ఫాసో, గబోన్ వంటి చిన్న దేశాల కంటే స్వేచ్ఛ విషయంలో అమెరికా దిగువన ఉండడం గమనార్హం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/