కుల్‌భూషన్‌ను కలిసేందుకు పాక్‌ అనుమతి

కుల్‌భూషన్‌ను కలిసేందుకు పాక్‌ అనుమతి
Pakistan offers third consular access to India for Kulbhushan

ఇస్లామాబాద్‌: కుల్‌భూషన్ జాదవ్‌ పాకిస్థాన్‌ చెరలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయను కలిసేందుకు భారత దౌత్య అధికారులకు పాకిస్థాన్‌ శుక్రవారం మరోసారి అనుమతి ఇచ్చింది. జాదవ్‌కు సమీపంలో పాక్ సెక్యూరిటీ సిబ్బంది ఉండకూడదన్న భారత్ డిమాండ్‌కు అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం పంపింది. పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి ఈ మేరకు పేర్కొన్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.

భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషన్ జాదవ్‌ను కలిసేందుకు పాకిస్థాన్ గురువారం రెండోసారి దౌత్యపరమైన అనుమతి ఇచ్చింది. గురువారం సాయంత్రం 4 గంటలకు (భారత కాలమానం ప్రకారం 4.30 గంటలకు) భారత దౌత్య అధికారులు జాదవ్‌ను కలువవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో భారత దౌత్య అధికారులు గురువారం జాదవ్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే పాక్ సెక్యూరిటీ వారి వెన్నంటే ఉండటంతో ఆయనతో ఏమీ మాట్లాడలేకపోయారు. కుల్‌భూషన్ జాదవ్ ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారని, ఆయనతో స్వేచ్ఛగా మాట్లాడేందుకు, ఉరిశిక్షపై సమీక్ష కోసం లిఖిత పూర్వకంగా అనుమతి తీసుకునేందుకు పాక్ అధికారులు అనుమతించకపోవడంపై భారత దౌత్య అధికారులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో కుల్‌భూషన్ జాదవ్‌ను స్వేచ్ఛగా కలిసేందుకు ఎలాంటి ఆటంకాలు కల్గించవద్దన్న అంతర్జాతీయ ట్రిబ్యునల్ తీర్పును పాకిస్థాన్ ఉల్లంఘించిందని భారత్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో తమ సెక్యూరిటీ సిబ్బంది దగ్గర లేకుండా జాదవ్‌ను భారత దౌత్య అధికారులు కలుసుకోవచ్చని పాకిస్థాన్ శుక్రవారం తెలిపింది. ఈ మేరకు మూడోసారి దౌత్య అనుమతి ఇచ్చింది. 


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/